సౌదీ ఆరామ్‌‘కింగ్‌’! | Saudi Aramco becomes most valuable listed company in history | Sakshi
Sakshi News home page

సౌదీ ఆరామ్‌‘కింగ్‌’!

Published Thu, Dec 12 2019 3:12 AM | Last Updated on Thu, Dec 12 2019 3:12 AM

Saudi Aramco becomes most valuable listed company in history - Sakshi

దుబాయ్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్‌ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్‌కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్‌కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్‌ మొబిల్, టోటల్, రాయల్‌ డచ్‌ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్‌ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది.

ఐపీఓ, మార్కెట్‌ విలువలోనూ అగ్రస్థానం....
ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌కో బ్రేక్‌ చేసింది. ఇక బంపర్‌ లిస్టింగ్‌తో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా కూడా ప్రపంచ నెంబర్‌–1 కంపెనీగా సౌదీ ఆరామ్‌కో అవతరించింది.

అంతే కాకుండా లిస్టెడ్‌ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్‌ 10 స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ (92,600 కోట్ల డాలర్లు), ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ (86,200 కోట్ల డాలర్లు), సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి.

► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్‌కో ప్రస్థానం మొదలైంది.
► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది.
►  ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు       సరఫరాల్లో 10%  ఈ సంస్థేదే.
► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.



13 రిలయన్స్‌లకు మించి...
ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్‌కో కన్నా తక్కువే!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement