State Agriculture Department
-
తక్కువ రేటుకే టమాటా...టమోటో ధరలకు ఏపీ ప్రభుత్వం కళ్లెం
-
ఆయిల్‌పామ్ సాగుకు కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 45,250 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు అనుమతి కోసం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని కోరారు. పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019–20 సంవత్సరానికి గాను 2,500 ఎకరాల్లో రాష్ట్ర ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగును ప్రారంభించిందని, రవాణా ఖర్చులు ఇచ్చి పంటను ఆయిల్ ఫెడ్ సేకరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 246 మండలాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర సర్వే తేల్చిందని, విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్‌పామ్ సాగు వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పంటల సాగుతో తెలంగాణ రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్నిరకాల పంటల సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలం అయినందున రాష్ట్ర వ్యవసాయ రంగానికి చేయూత నివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ రబీ నుంచి బ్యాంకు రుణాలు తీసుకునే రైతులెవరైనా బీమా ప్రీమియం చెల్లింపు నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకుండా నిబంధనలు తీసుకొస్తూ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియాన్ని కంపెనీలకు చెల్లిస్తాయి. అనేకమంది రైతులు కోర్టుకు వెళ్లి ప్రీమియం చెల్లించకుండా మినహాయింపు పొందుతున్నారు. ఈ రబీ నుంచి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా తాజా మార్గదర్శకాల్లో కఠిన నిబంధన తయారు చేశారు. బీమా పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా... బీమా క్లెయిమ్స్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా విధించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితికి 2 నెలలు దాటితే 12 వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయనుంది. వరికి డిసెంబర్ 31 గడువు తేదీ... రబీలో వరి, జొన్న, మినుములు, పొద్దు తిరుగుడు, పెసర, వేరుశనగ, ఎర్ర మిరప, నువ్వులు, ఉల్లి పంటలకు రైతులు ప్రీమియం చెల్లించే గడువును డిసెంబర్ 31గా నిర్ధారించారు. ఒకవేళ వాతావరణం బాగోలేక కరువు పరిస్థితులు వంటివి ఏర్పడి ఆయా పంటల సాగు ఆలస్యమైతే వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు ఈ పంటలకు ప్రీమియం చెల్లించే అవకాశం కల్పిస్తారు. ఇక మొక్కజొన్నకు డిసెంబర్ 15ను ప్రీమియం చెల్లించేందుకు గడువు తేదీ ఖరారు చేశారు. ఈ పంట వాతావరణ పరిస్థితుల్లో తేడా వస్తే డిసెంబర్ 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. శనగకు నవంబర్ 30వ తేదీ నాటికి ప్రీమియం చెల్లించేందుకు గడువిచ్చారు. వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తేదీ నాటి వరకు గడువిచ్చారు. -
ఉపాధి హామీతో రైతుల ఆదాయం పెంపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని కేంద్ర గ్రామీణాభివృ ద్ధిశాఖ కార్యదర్శి అమర్జిత్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు’ లక్ష్యంతో వ్యవసాయం, ఉపాధి హామీ అనుసంధానం విధానాన్ని రూపొందించే అంశంపై ‘నీతి ఆయోగ్, రాష్ట్ర వ్యవసాయశాఖ’ సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్రాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు గుర్తించామన్నారు. పంటల సాగు ఖర్చును తగ్గించటం, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల నిర్మాణం ద్వారా వారి ఆదాయం పెంపొందించవచ్చని తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు తగ్గించడం వలన మేలైన ఫలితాలు లభిస్తాయని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కూలీల వేతనాలు స్థిరంగా ఉన్నాయి కానీ, వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు గణనీయం గా పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పు లు చేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో సమర్థవంతంగా అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతుల ఆదాయం పెంపొందించడానికి ప్రకృతి వనరుల యాజమాన్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన రుణ సదుపాయం, పరిశోధన, మార్కెటింగ్ వ్యూహాలు తదితర తొమ్మిది అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. 98% చిన్న, సన్నకారు రైతులు: సీఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపొందించడానికి అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వివరించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు పథకం ప్రారంభించామని, సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షల ఉచిత బీమాను ప్రతి రైతుకు అందిస్తున్నామన్నారు. భూసర్వే ద్వారా తెలంగాణలో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హరితహారం పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందున ఉపాధి హామీలో వేతనం కింద అధిక నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇన్పుట్ ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంపొందించినప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నా రు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసార థి స్వాగతోపన్యాసం చేస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలను వివిధ వర్గాల నుండి తీసుకోవడానికి ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తగు సూచనలు అందించాలని ఆయన కోరారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమా ర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, నీతి ఆయోగ్ సలహాదారు ఎ.కె.జైన్, ఎన్.ఐ.ఆర్.డి డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్లు్య ఆర్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, నీతి ఆయోగ్ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
1.56 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సీజన్లో వేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బోరు బావుల కింద వేసిన పంటలే అధికంగా ఎండినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసిన ఆ శాఖ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ ప్రకారం మొత్తం 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాల్లో వరి ఎండింది. అలాగే 4,130 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. 17 జిల్లాలకు చెందిన 197 మండలాల్లో పంటలు ఎండిపోయినట్లు నివేదిక తెలిపింది. అత్యధికంగా మెదక్ జిల్లాలోని 20 మండలాల్లో 33,620 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 28,572 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 28 వేల ఎకరాల వరి పంట ఎండిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. బోరు బావుల కిందే 1.46 లక్షల ఎకరాలు...: జిల్లాల్లోని 197 మండలాల్లో 26.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 18.54 లక్షల ఎకరాల్లో బోరు బావుల కింద సాగయ్యాయి. మిగిలినవి చెరువులు, కాలువలు, ఎత్తిపోతల కింద సాగయ్యాయి.అన్ని పంటలు కలిపి 1.56 లక్షల ఎకరాల్లో ఎండిపోగా, అందులో 1.46 లక్షల ఎకరాలు బోరు బావుల కిందే ఎండిపోవడం గమనార్హం. బోరు బావుల్లో నీరు అడుగంటిపోవడమే కారణమని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. -
వాగునీరు విషతుల్యం
చిలకలూరిపేటరూరల్ : ఆయిల్ కంపెనీల నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిల్లుల్లోని వ్యర్థ రసాయనాలను వాగుల్లోకి విడుదల చేసి ఆ నీటిని విషతుల్యం చేస్తున్నారు. ఫలితంగా ఆనీటిని సాగుకు వినియోగించిన పొలాల్లోని పంటలు ఎండుముఖం పడుతుండగా.. రంగుమారి నురుగుతో కూడిన వాగు నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయి. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామ శివారులో రాష్ర్ట వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆయిల్‌మిల్ ఉంది. ఈ మిల్లుతోపాటు ఎగువున ఉన్న మరికొన్ని కంపెనీల్లో అవసరాలకు వినియోగించిన కలుషిత నీటిని కుప్పగంజివాగులోకి తరలిస్తున్నారు. రసాయనాలు కలిసిన నీరు వాగులో చేరటంతో ఆనీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. మానుకొండవారిపాలెం - వేలూరు గ్రామాల మధ్య ప్రవహించే ఈ వాగు నీటిని ప్రజలు తాగేందుకు, పంటల సాగుకు వినియోగిస్తారు. కలుషిత నీటిని తాగిన ప్రజలు అనారోగ్యానికి గురౌతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. వాగునీటిని సాగుకు వినియోగిస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వేలూరు, మానుకొండవారిపాలెం, దండమూడి, గొట్టిపాడు, మిట్టపాలెం తదితర గ్రామాల ప్రజలు ఈ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాగునీరు చెరువుల్లోకి... చిలకలూరిపేట మండలంలోని వివిధ గ్రామాలు సాగర్ ఆయకట్టు టేల్పాండ్ (చివరి ప్రాంతంలో) ఉన్నాయి. కుడికాలువ నీరు పూర్తిస్థాయిలో ప్రవహించకపోవటంతో వాగు నీటిని తాగునీటి చెరువులకు పంపింగ్ చేస్తారు. రసాయనాలతో కలిసిన మురుగునీరు చెరువులకు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వేలూరులోని చెరువుకు నీటిని పంపింగ్ చేసేందుకు వాగు సమీపంలోనే పంపింగ్ హౌస్‌ను నిర్మించారు. ఈ నీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దండమూడి గ్రామంలో వాగు పరీవాహకంలో బోర్ నుంచి వస్తున్న నీరు కూడా కలుషితమైంది. పంటపొలాలకూ రసాయన నీరు... పరిశ్రమల్లో పత్తి విత్తనాల నుంచి నూనె తీసేందుకు, క్రూడ్ ఆయిల్‌ను వేరు చేసేందుకు అధికంగా కార్బన్-ఎస్, హైడ్రోసోడియం, కాస్టిక్ సోడా, కొన్ని సందర్భాల్లో యాసిడ్‌ను వినియోగిస్తారు. పరిశ్రమల ద్వారా నిత్యం వచ్చే వృథా నీటిని మిల్లులో చెరువులను ఏర్పాటు చేసి నిల్వ చేస్తారు. ఈ నీటిని వేసవి ప్రారంభంలోనే విడుదల చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువకు ఈనెల 15వ తేదీ తర్వాత నీరు నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు సాగు నీటి కోసం ఎదురు చూశారు. ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగు నీరు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ప్రత్యామ్నాయంగా వాగునీటిని ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కుప్పగంజి వాగు నీటిలో రసాయనాలు కలవటంతో ఇదే నీరు ఓగేరు వాగులో గొట్టిపాడు వద్ద కలిసిపోతోంది. దీనిపై అవగాహనలేని రైతులు పొగాకు, జొన్న, అపరాలు తదితర పంటలకు కలుషిత నీటిని పెడుతున్నారు. ఫలితంగా ఆ పంటలు దెబ్బతింటున్నాయి. రచ్చబండలో రచ్చ రచ్చ... వాగునీటిలోకి రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తుందని వీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. మానుకొండవారిపాలెం గ్రామంలో గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాగునీటి సమస్యపై ప్రత్తిపాటిని ప్రజలు ప్రశ్నించగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ దీనిపై ఆయన దృష్టిసారించలేదు. కలుషిత నీటిని వాగులో కలువకుండా చూసి ప్రజా రోగ్యాన్ని పరిరక్షించాలని బాధిత గ్రామా ల ప్రజలు అధికారులను కోరుతున్నారు. -
గడువు పొడిగింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించినా, రాజధాని గ్రామాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూ సమీకరణకు తుళ్లూరు రైతులు సానుకూలంగా ఉన్నప్పటికీ తాడేపల్లి, మంగళగిరిలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా భూ అంగీకార పత్రాలకు బదులు అభ్యంతర పత్రాలు ఇస్తున్నారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జరగకపోవడంతో గడువు ముగిసేరోజుకు (శనివారం) 21, 627 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. గడువు పొడిగింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినప్పటికీ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. అయినా భూ సమీకరణ పూర్తవుతుందనే నమ్మకం అధికారుల్లో కలగడం లేదు. ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరిలో వైఎస్సార్ సీపీతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉండవల్లి, పెనుమాక గ్రామాల సరిహద్దులో ఁమన భూమి కోసం రైతు దీక్ష రూ. పేరుతో రైతులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఇతర సీనియర్ నేతలు రామచంద్రయ్య, జేడీ శీలం, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు తిరునవక్కన్ తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన అన్ని రకాల హామీలు తక్షణమే నేర వేర్చేందుకు కేంద్రపై ఒత్తిడి తెస్తూ ఈ నెల 28న పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నాయకులు పాల్గొని సారవంతమైన భూముల్లో సమీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముగింపు కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు పాల్గొని భూ సమీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు భూ సమీకరణకు రైతులు సహకరించకపోయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా గడువు తేదీని పొడిగించుకుంటూ వెళుతోంది. భూ సమీకరణకు ఎలాంటి చట్టబద్ధత లేదని చెప్పడానికి ఈ గడువు పొడిగింపు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ మిగిలిన రోజుల్లోనూ అభ్యంతర పత్రాలు ఇవ్వాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రైతుల్ని వ్యక్తిగతంగా కలిసే యత్నం ... ఈ నెలాఖరు వరకు భూ సమీకరణను వేగవంతం చేసేందుకు అధికార పార్టీ మరో ప్రయత్నాన్ని చేపడుతోంది. భూ అంగీకారపత్రాలు ఇవ్వని రైతుల్ని పార్టీనేతలు, అధికారులు వ్యక్తిగతంగా కలుసుకుని రాజధాని ఏర్పాటు ఆవశ్యకత, రైతులకు ఇచ్చే ప్యాకేజీ, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని మంత్రి పుల్లారావు చెప్పారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు. -
రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి గుంటూరు సిటీ : రైతుల రుణమాఫీకి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ పాసు పుస్త పుస్తకాలతో బ్యాంకుల ద్వారా రుణాలు, ఒకే పాస్ పుస్తకంపై పలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులను గుర్తించటానికి ఆధార్‌తోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసియాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన గుంటూరు మిర్చియార్డు ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మిర్చియార్డులో జరిగిన పలు అవకతవకలపై తమకు ఫిర్యాదులు అందాయని, విచారించి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళిక రూపొందించాల్పిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వడగాల్పుల వలన జిల్లాలో ఇప్పటి వరకూ 37 మంది చనిపోయినట్లు తెలిపారు. వీరిలో 15 మందికి సంబంధించిన కుటుంబాలకు రూ. లక్ష వంతున ఎక్స్ గ్రేషియా చెల్లించామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లింపు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. లాం ఫారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మొదటి విడతగా రూ. 548 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే మంగళగిరి వద్ద ఉన్న టి.బి శానిటోరియం ప్రాంతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి జె.ఆర్ పుష్పరాజ్ , వ్యవసాయ శాఖ జేడీ వి.శ్రీధర్, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు పాల్గొన్నారు. -
రేసులో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి.. నిన్న మొన్నటి వరకు అదో ముళ్ల కిరీటం... పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించడం, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడపడం, కార్యాలయ నిర్వహణకు సొంత నిధులు కేటాయించడం... కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు జరిపినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం వంటివి అధ్యక్ష పదవి నిర్వహించే నేతకు కత్తిమీద సాము వంటిది! పదేళ్లపాటు పార్టీ అధికారంలో లేనప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించారు. ఇంటా.. బయట రాజకీయాలను తట్టుకుని పార్టీని నెట్టుకొచ్చారు. నిన్నటి ఎన్నికలో పార్టీ అధికారంలోకి రావడంతో ప్రత్తిపాటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. దీనితో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి వచ్చింది. నిన్నటి వరకు ఆ పదవంటే మనకెందుకులే.. మన వ్యాపారాలు మనం చూసుకుందాం.. అధినేత పిలుపునిచ్చినప్పుడు అరగంటో... గంటో ఆ కార్యక్రమంలో పాల్గొని చేతులు దులుపుకుందామని కొందరు నేతలు భావించారు. ఇప్పుడు అనూహ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఆ పదవికీ గౌరవం పెరిగింది. దీనితో కొందరు నేతలు ఆ పదవి ద్వారా తమ హోదాను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెనాలి, పొన్నూరు, గురజాల ఎమ్మెల్యేలు ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో వినికిడి. ఎవరి ప్రయత్నాలు వారివే.. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అవి ఫలించకపోయినా అధినేతపై ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన అభిమానులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా నరేంద్రకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన శాసనసభ స్పీకర్ పదవి ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారు. జిల్లా రాజకీయాల్లో మార్పుల దృష్ట్యా ఆ పదవిని డాక్టర్ కోడెల శివప్రసాద్‌కు ఇచ్చారు. కనీసం అధ్యక్షపదవైనా దక్కుతుందేమోనని ఆశగా చూస్తున్నారు. అలాగే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్తిపాటి వర్గమైన యరపతినేని ఇక జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ అధినేత వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర విజయవంతం కావడం వెనుక యరపతినేని కృషి పేర్కొనదగినదేనని పార్టీనేతలంతా భావిస్తున్నారు. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను అంకితభావంతో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చంద్రబాబును, జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావును కోరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ప్రత్తిపాటికి సన్నిహితంగా ఉండే యరపతినేనికి జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
రైతులను ఆదుకుంటాం
అచ్చంపేట రూరల్, న్యూస్‌లైన్ : తుఫాన్ బా ధితులను పరామర్శిస్తూ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నల్లమలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యటించారు. వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ హైదరాబాద్ అదనపు సంచాల కులు విజయలక్ష్మి, జిల్లా డిప్యూటీ డెరైక్టర్ ర ఘురాం, ఏరువాక రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ, హైదరాబాద్ ఏడీఏలు శైలజ, శ్రీనివాసచారి, అచ్చంపేట సహాయ సంచాలకులు సరళకుమారి తదితరులు అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో పర్యటించి పంటపొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించామని తెలిపారు. రైతులతో నేరుగా మాట్లాడి జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయి అధికారులతో అంచనా వేయిస్తున్నామని చెప్పారు. రైతులు భయపడాల్సిన అవసరంలేదని, పరిహారం అందిస్తామన్నారు. పర్యటనలో ఎమ్మెల్యే రాములు, టీడీపీ రాష్ట్ర నాయకులు పి. మనోహర్, తులసీరాం, నియోజకవర్గ వ్యవసాయాధికారులు కృష్ణమోహన్, జగదీశ్వరచారి, సర్పంచ్ తదితరులున్నారు. పంటలను పరిశీలించిన రాష్ట్ర అధికారి తెలకపల్లి : మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంటపొలాలను వ్యవసాయ రాష్ట్ర అడిషనల్ డెరైక్టర్ విజయలక్ష్మి ఆదివారం సందర్శించారు. తాళ్లపల్లి, నడిగ డ్డ గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతుల ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జిల్లా అధికారు ల నివేదికల ఆధారంగా ప్రతిరైతును అన్నివి ధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.ఆమె వెంట ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, ఏడీఏ మునిస్వామి, డీడీఏ రఘరాములు, ఇ తర వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.