రేసులో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి.. నిన్న మొన్నటి వరకు అదో ముళ్ల కిరీటం... పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించడం, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడపడం, కార్యాలయ నిర్వహణకు సొంత నిధులు కేటాయించడం... కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు జరిపినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం వంటివి అధ్యక్ష పదవి నిర్వహించే నేతకు కత్తిమీద సాము వంటిది! పదేళ్లపాటు పార్టీ అధికారంలో లేనప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించారు. ఇంటా.. బయట రాజకీయాలను తట్టుకుని పార్టీని నెట్టుకొచ్చారు. నిన్నటి ఎన్నికలో పార్టీ అధికారంలోకి రావడంతో ప్రత్తిపాటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు.
దీనితో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి వచ్చింది. నిన్నటి వరకు ఆ పదవంటే మనకెందుకులే.. మన వ్యాపారాలు మనం చూసుకుందాం.. అధినేత పిలుపునిచ్చినప్పుడు అరగంటో... గంటో ఆ కార్యక్రమంలో పాల్గొని చేతులు దులుపుకుందామని కొందరు నేతలు భావించారు. ఇప్పుడు అనూహ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఆ పదవికీ గౌరవం పెరిగింది. దీనితో కొందరు నేతలు ఆ పదవి ద్వారా తమ హోదాను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెనాలి, పొన్నూరు, గురజాల ఎమ్మెల్యేలు ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో వినికిడి.
ఎవరి ప్రయత్నాలు వారివే..
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అవి ఫలించకపోయినా అధినేతపై ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన అభిమానులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా నరేంద్రకు మంత్రి పదవి దక్కలేదు.
దీంతో ఆయన శాసనసభ స్పీకర్ పదవి ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారు. జిల్లా రాజకీయాల్లో మార్పుల దృష్ట్యా ఆ పదవిని డాక్టర్ కోడెల శివప్రసాద్‌కు ఇచ్చారు. కనీసం అధ్యక్షపదవైనా దక్కుతుందేమోనని ఆశగా చూస్తున్నారు. అలాగే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్తిపాటి వర్గమైన యరపతినేని ఇక జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు.
పార్టీ అధినేత వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర విజయవంతం కావడం వెనుక యరపతినేని కృషి పేర్కొనదగినదేనని పార్టీనేతలంతా భావిస్తున్నారు. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను అంకితభావంతో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చంద్రబాబును, జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావును కోరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ప్రత్తిపాటికి సన్నిహితంగా ఉండే యరపతినేనికి జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.