రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు సిటీ : రైతుల రుణమాఫీకి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ పాసు పుస్త పుస్తకాలతో బ్యాంకుల ద్వారా రుణాలు, ఒకే పాస్ పుస్తకంపై పలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులను గుర్తించటానికి ఆధార్‌తోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసియాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన గుంటూరు మిర్చియార్డు ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మిర్చియార్డులో జరిగిన పలు అవకతవకలపై తమకు ఫిర్యాదులు అందాయని, విచారించి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళిక రూపొందించాల్పిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వడగాల్పుల వలన జిల్లాలో ఇప్పటి వరకూ 37 మంది చనిపోయినట్లు తెలిపారు.
వీరిలో 15 మందికి సంబంధించిన కుటుంబాలకు రూ. లక్ష వంతున ఎక్స్ గ్రేషియా చెల్లించామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లింపు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. లాం ఫారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మొదటి విడతగా రూ. 548 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే మంగళగిరి వద్ద ఉన్న టి.బి శానిటోరియం ప్రాంతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి జె.ఆర్ పుష్పరాజ్ , వ్యవసాయ శాఖ జేడీ వి.శ్రీధర్, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
Published Fri, Jun 27 2014 12:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement