తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి ఇవ్వాల్సిన భూమికి సైతం రాజధాని పేరుతో మొండిచెయ్యి చూపింది. పాకిస్తాన్‌తో యుద్ధంతో వీరమరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం అతడి మాతృమూర్తి, దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఆమె అనారోగ్యానికి గురైంది. తాను తనువు చాలించేలోగానైనా న్యాయం జరగాలని 92 ఏళ్ల ఆ వీరమాత వేడుతోంది. ఆ తల్లి పేరు తోట వెంకాయమ్మ. భర్త 35 ఏళ్ల క్రితమే కాలం చేశాడు. స్థానిక గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ యుక్తవయసులోనే సైన్యంలో చేరాడు. చేరిన కొద్దికాలానికే 1965లో వచ్చిన ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో అమరుడయ్యాడు. అతని తాగ్యానికి నివాళిగా 1966లో ప్రభుత్వం అప్పట్లో గుంటూరు జిల్లా పరిధిలోని చినగంజాంలో 2.5 ఎకరాల వర్షాధారమైన భూమిని (సర్వే నెం.701/1) కేటాయించింది. వీరనాగప్రసాద్ అవివాహితుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. పేరుకైతే భూమిని ఇచ్చారుగానీ, అధికారుల అర్థంకాని నిర్ణయాలు, అంతులేని అలసత్వంతో ఆ భూమి ఇప్పటికీ తనకు దక్కనేలేదు.
అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల చుట్టూ..
1965లో ఇచ్చిన భూమిని మరో మూడేళ్లకు ప్రభుత్వ అవసరాల కోసమంటూ మరొకరికి కేటాయించారు. అక్కడే సర్వే నంబరు 704/2లో అంతే విస్తీర్ణంలో భూమిని వెంకాయమ్మకు ఇచ్చారు. 1982లో దానినీ స్వాధీనం చేసుకుంది. 396/4, 396/5 సర్వే నంబర్లలోని 2.85 ఎకరాల చెరువు భూమిని ఇచ్చారు. ఒండ్రు మట్టితో గల ఆ భూమి సుభిక్షమైందని నమ్మబలికారు. అదైనా తీసుకుందామని వెళ్లిన వెంకాయమ్మ కుటుంబసభ్యులను పంచాయతీవారు అడ్డుకున్నారు. చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని నిరోధించారు. పైగా న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తమ ప్రమేయం లేని వ్యవహారంలో వెంకాయమ్మ కోర్టు వాయిదాలకు తిరగాల్సి వచ్చింది. కోర్టులో పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది.
‘ప్రకాశం’కు చేరిన పొలం వ్యవహారం..
ఈలోగా జిల్లాల విభజన జరగటంతో చినగంజాం ప్రకాశం జిల్లాలోకి వెళ్లింది. జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరుకు వెంకాయమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్ స్పందించారు. వెంకాయమ్మ కుటుంబం తెనాలిలోనే ఉంటున్నందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఆ లేఖ 2016 ఫిబ్రవరి 15న తగుచర్యల నిమిత్తం జిల్లా కలెక్టరేట్ నుంచి తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది. అనువైన భూమి కోసం అప్పటి ఆర్డీవో జి.నరసింహులు డివిజనులోని తహసీల్దార్లను నివేదిక కోరారు. నివేదికతో సహా అప్పటి ప్రభుత్వానికి పంపారు.
రాజధాని పేరుతో మొండిచెయ్యి..
దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించటం, వివిధ పరిపాలన విభాగాలను స్థాపించటం వంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గుంటూరు జిల్లా ప్రభుత్వ ఖాళీస్థలం చాలా అవసరమైనందున దరఖాస్తుదారు అభ్యర్థన ఆచరణీయం కాదు’ అంటూ తిరస్కరించింది. దీనితో మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తికి అనారోగ్యం ప్రాప్తించింది. తన గోడునంతా వివరిస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తును పంపారు. న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు.
చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
Comments
Please login to add a commentAdd a comment