సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించినా, రాజధాని గ్రామాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూ సమీకరణకు తుళ్లూరు రైతులు సానుకూలంగా ఉన్నప్పటికీ తాడేపల్లి, మంగళగిరిలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా భూ అంగీకార పత్రాలకు బదులు అభ్యంతర పత్రాలు ఇస్తున్నారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జరగకపోవడంతో గడువు ముగిసేరోజుకు (శనివారం) 21, 627 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. గడువు పొడిగింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినప్పటికీ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. అయినా భూ సమీకరణ పూర్తవుతుందనే నమ్మకం అధికారుల్లో కలగడం లేదు. ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరిలో వైఎస్సార్ సీపీతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.
ఆదివారం ఉండవల్లి, పెనుమాక గ్రామాల సరిహద్దులో ఁమన భూమి కోసం రైతు దీక్ష రూ. పేరుతో రైతులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఇతర సీనియర్ నేతలు రామచంద్రయ్య, జేడీ శీలం, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు తిరునవక్కన్ తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన అన్ని రకాల హామీలు తక్షణమే నేర వేర్చేందుకు కేంద్రపై ఒత్తిడి తెస్తూ ఈ నెల 28న పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నాయకులు పాల్గొని సారవంతమైన భూముల్లో సమీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ముగింపు కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు పాల్గొని భూ సమీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు భూ సమీకరణకు రైతులు సహకరించకపోయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా గడువు తేదీని పొడిగించుకుంటూ వెళుతోంది. భూ సమీకరణకు ఎలాంటి చట్టబద్ధత లేదని చెప్పడానికి ఈ గడువు పొడిగింపు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ మిగిలిన రోజుల్లోనూ అభ్యంతర పత్రాలు ఇవ్వాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు.
మిగిలిన రైతుల్ని వ్యక్తిగతంగా కలిసే యత్నం ...
ఈ నెలాఖరు వరకు భూ సమీకరణను వేగవంతం చేసేందుకు అధికార పార్టీ మరో ప్రయత్నాన్ని చేపడుతోంది. భూ అంగీకారపత్రాలు ఇవ్వని రైతుల్ని పార్టీనేతలు, అధికారులు వ్యక్తిగతంగా కలుసుకుని రాజధాని ఏర్పాటు ఆవశ్యకత, రైతులకు ఇచ్చే ప్యాకేజీ, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని మంత్రి పుల్లారావు చెప్పారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు.
గడువు పొడిగింపు
Published Mon, Feb 16 2015 2:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement