కంభం మండలం ఔరంగబాదులో నీరందక పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న గ్రామస్తులు
జనం గొంతెండుతోంది. పశ్చిమాన పల్లెలన్నీ గుక్కెడు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. చినుకు జాడ కనిపించడం లేదు. జూలై చివరి నాటికే సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నీళ్లు అడుగంటాయి. పొలాల్లో ఉండే వ్యవసాయ బోర్లపై ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. 4 టీఎంసీల సాగర్ నీరు వస్తే తప్ప జిల్లా ప్రజల దాహం తీరదు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తాగునీటి ఇక్కట్లు పతాక స్థాయికి చేరాయి. పశ్చిమ ప్రకాశం పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వెయ్యి గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. ప్రభుత్వం మాత్రం గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో 419 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు మూడు నియోజకవర్గాల్లోనే 300 గ్రామాలు ఉండగా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 119 గ్రామాలు ఉన్నాయి. అయితే పై 6 నియోజకవర్గాల్లో వెయ్యి గ్రామాల్లో నీటి సమస్య అధికమైంది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 419 గ్రామాల్లో మాత్రమే అరకొర నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకుంటుంది. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా జిల్లాలో చినుకు జాడ లేదు. దీంతో పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వేలాది చేతి పంపులు, ప్రభుత్వ తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి.
వర్షం వస్తే తప్ప ప్రజల తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. మనుషులతో పాటు పశువులకు నీరు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై మూడు నియోజకవర్గాల్లోనే దాదాపు 700 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు ప్రకాశంలోనూ నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగర్ పరివాహక ప్రాంతంలో 292 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సాగర్ నీటితో అధికారులు ఈ ట్యాంకులను నింపారు. జూలై చివరి నాటికే ట్యాంకులు అడుగంటాయి. ప్రస్తుతం చుక్కనీరు లేదు. రెండు మూడు రోజుల్లో చెరువులు నీటితో నింపకపోతే సాగర్ పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. ఇక ఒంగోలు నగరానికి ఇప్పటికే తాగునీటి ఇక్కట్లు తలెత్తాయి. నగర పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. మరో వారంలోపు పూర్తిగా నీరు ఆగిపోతుంది. అదే జరిగితే లక్షలాది మంది నగర వాసులకు తాగునీటి ఇబ్బందులు తీవ్రస్థాయికి చేరుతాయి.
ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు నగర వాసులకు అరకొర నీటిని మాత్రమే అందిస్తున్నారు. మూడురోజులకు ఒక మారు నీటి విడుదల అని పేరుకు చెబుతున్నా సక్రమంగా నీరు అందడం లేదు. గంటపాటు కూడా నీరు వదలడం లేదు. మళ్ళీ వారం రోజుల పాటు నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. తక్షణం 4 టీఎంసీల సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తక్షణం నీటిని విడుదల చేయకపోతే పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ తాగునీటి ఇబ్బందులు పతాక స్థాయి కి చేరే ప్రమాదం ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో 142 గ్రామాల పరిధిలో రోజూ 1214 ట్రిప్పుల నీటిని ప్రభుత్వం సరఫరా చేయగా, ఫిబ్రవరి నెలలో 178 గ్రామాల పరిధిలో 1591 ట్రిప్పులు, మార్చి నెలలో 247 గ్రామాల పరిధిలో 2492 ట్రిప్పులు, ఏప్రిల్‌లో 316 గ్రామాల పరిధిలో ప్రతి రోజు 3,308 ట్రిప్పుల చొప్పున నీటిని సరఫరా చేశారు. రాను రాను ఇది పెరిగింది.
తాజాగా శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 419 గ్రామాల్లో రోజూ 4500 ట్రిప్పుల చొప్పున ప్రభుత్వం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. వర్షాలు కురవక పోతే ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీరు మొక్కుబడిగా కూడా ప్రజలకు అందడం లేదు. అధికారులు చూపిస్తున్న గణాంకాల్లో చాలా మటుకు తప్పుడు గణాంకాలన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాగర్ నీటిని విడుదల చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపాలి. పశ్చిమ ప్రకాశంలో నీరున్న ప్రాంతాల నుంచి తాగునీటి ఇబ్బందులున్న అన్ని గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది.
తూర్పు ప్రకాశంలో నీటి కొరత:
వర్షాకాలం వచ్చినా పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ నీటి కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు నెల వచ్చినా జిల్లాలో చినుకు జాడ లేదు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, కొండపి, దర్శి, యర్రగొండపాలెం పరిధిలో 292 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఏప్రిల్‌లో అధికారులు నీటితో నింపారు. జూలై చివరి వరకు నీటి ఇబ్బందులు ఉండవన్నారు. జూలై ముగిసి ఆగస్టు నెల వచ్చింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. ఒకటి రెండు రోజులు మినహా ప్రజలకు నీరు అందే పరిస్థితి లేదు. ఈ లోపు సాగర్ నీటిని విడుదల చేయకపోతే నగర వాసులు నీటి కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment