సాక్షి, విజయవాడ : ఇకపై నెలలో ఎనిమిది రోజుల పాటు రవాణా శాఖ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.కె.వి.ప్రసాదరావు తెలిపారు. ప్రజల్లో రవాణా భద్రతపై మరింత అవగాహన పెంచాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలనే లక్ష్యంతో ప్రతి నెలా ఎనిమిది రోజులపాటు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జరిమానా విధింపు కాకుండా కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. బుధవారం ఆయన విజయవాడలోని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు గన్నవరం డ్రైవింగ్ ట్రాక్ సెంటర్‌లో జరుగుతున్న స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కొన్నిరోజుల్లో విద్యా సంవత్సరం మొదలుకానున్న నేపథ్యంలో జిల్లాలోని 2104 స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌ను పరీక్షించటంతో పాటు బస్సు డ్రైవర్ లెసైన్స్ వివరాలు, డ్రైవ్ వివరాలు, స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల సంఖ్య, వివరాలు, ఇలా అన్ని వివరాలను రవాణా శాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచటం తప్పనిసరి నిబంధన చేశామన్నారు. ప్రస్తుతంఎంవీఐలు బస్సులు పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలంటే వివరాలు మొత్తం ఆన్‌లైన్‌లో నమోదు అయి ఉండాలన్నారు. లేని పక్షంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ కాదని సృష్టం చేశారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ పరీక్షలను రోజుకు ఆరుగురు ఎంవీఐలు చేస్తున్నారని, రోజుకు 60 బస్సులన్ని మాత్రమే సర్టిఫికెట్ జారీ చేయటానికి వీలు అవుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల యాజమాన్యాలు సకాలంలలో ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఇప్పటి వరకు 225 బస్సుల్ని పరీక్షించి 88 ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పారు.
ప్రత్యేక డ్రైవ్‌లో డ్రైవింగ్ లెసైన్స్ ఇతర వివరాలను పరిశీలిస్తారన్నారు. రికార్డులు సక్రమంగా లేకపోయినా, లెసైన్స్ లేకపోయినా, మద్యం సేవించి వాహనం నడిపినా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే మద్యం సేవించి వాహనం నడిపే కేసుల్లో రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకు శిక్ష పడుతుందని చెప్పారు. జిల్లాలో 35 శాతం మందికి డ్రైవింగ్ లెసైన్స్ లేదని తమ తనిఖీల్లో నిరార్థణ అయిందని చెప్పారు. జూలై ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణా లు, జాతీయ రహదారుల్లో ప్రయాణించేప్ర తి ఒక్కరూ హైల్మట్ ధరించాలని సూచించారు.
ఫిట్‌నెస్ టెస్టింగ్ సెంటర్ ...
గన్నవరంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆటోమెటిక్ ఫిట్‌నెస్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో ఏర్పాటుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు. వీరపనేనిగూడెం, కేతనకొండలో స్థలాలను పరిశీలించామని, భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా అక్కడ డ్రైవింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటేశ్వరరావు, ఆర్టీవోలు పురేంద్ర, సిరి ఆనంద్, ఏవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నెలలో 8 రోజులు రవాణా శాఖ డ్రైవ్
Published Thu, May 21 2015 3:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement