
వీడిన డ్రైవర్ హత్యకేసు మిస్టరీ
రాజమండ్రిలో గత నెల 28న జరిగిన విశాఖకు చెందిన కారు డ్రైవర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
హతమార్చింది కార్లు దొంగిలించే ముఠా
నిందితులను పట్టించిన సీసీ కెమెరా ఫుటేజ్
రాజమండ్రి క్రైం: రాజమండ్రిలో గత నెల 28న జరిగిన విశాఖకు చెందిన కారు డ్రైవర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కొత్త కార్లు దొంగిలించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకునే లక్ష్యంతో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. బొమ్మూరు సీఐ పి.కనకారావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి గ్రామానికి చెందిన బుదిరెడ్డి దుర్గాసురేష్, వైరాల చిరంజీవి కొత్త కార్లను కిరాయికి మాట్లాడుకుని డ్రైవర్‌ను హత్య చేసి కార్లను దొంగిలిస్తుంటారు. జూన్ 28న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలోని సీఎంఆర్ షాపింగ్‌మాల్ సెంటర్ నుంచి మారుతీ కారును రాజమండ్రికి కిరాయికి మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కారులో రాజమండ్రి శాటిలైట్ సిటీ దాటిన తరువాత విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన కారు డ్రైవర్ కర్రి కిరణ్(26)ను కారులోనే కత్తులతో పొడిచి చంపారు.
అనంతరం మృతదేహాన్ని శాటిలైట్ సిటీ శివారు ప్రాంతానికి, తర్వాత బుచ్చియ్యనగర్ రోడ్డులోని గాదాలమ్మ నగర్ గుట్టపైకి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టారు. కారును అక్కడ నుంచి రంగంపేట మండలం సింగపల్లి గ్రామంలో ఉన్న స్నేహితుడు కొప్పిరెడ్డి అంజి వద్దకు తీసుకెళ్లి విక్రయించమని అప్పగించారు. అంజి కారును ఇంటి వద్ద దాచాడు. ఆ మరుసటి రో జు హత్య గురించి పత్రికల్లో వచ్చిన వార్తను చదివి కారులోని ఆడియో సిస్టమ్ ను, స్టెఫిన్ టైర్, పెన్‌డ్రైవ్‌లను సింగంపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి లక్ష్మీనారాయణ (పండు) సహాయంతో తీసివేసి, సూరంపాలెం పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ వద్ద కారు వదిలివేశారు.
పట్టించిన సీసీ కెమెరా ఫుటేజ్‌లు
కేసు దర్యాప్తు కోసం కారు కిరాయికి మాట్లాడుకున్న ప్రదేశం విశాఖపట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పోలీసులు వెళ్లా రు. అక్కడకు సమీపంలో ఉన్న స్పెన్సర్ షోరూమ్‌లో నిందితు లు కత్తులు, కారం కొనుగోలు చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌ల లో నమోదైంది. దీంతో నిందితుల ఆచూకీ లభించింది. ధర్మవరం సమీపంలోని టోల్‌గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కూడా నిందితుల ఆధారాలు లభించాయి. ఆ ఫొటోల ఆధారంగా మోరంపూడి సెంటర్‌లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద 28 రాత్రి పనిచేసిన సిబ్బంది నిందితులను గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.