
దిగివచ్చిన హరివిల్లు
కడప కల్చరల్ : కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూలు మైదానంలో ఆదివారం హరివిల్లు దిగివచ్చిందా అని అనిపించింది. శ్రీ గోపాల్ ఆటోస్టోర్స్ సౌజన్యంతో సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలతోపాటు పలు ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. గౌరమ్మను కొలువుదీర్చిన వారు కొందరైతే, పొంగళ్లు పెట్టిన వారు మరికొందరు.
ముగ్గులను బంతిపూలతో నింపిన వారు ఇంకొందరైతే, తళుకు బెళుకులతో ముస్తాబు చేసిన వారు మరికొందరు. వైవీయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి, ముడియం హేమలత, సాక్షి ప్రకటనల విభాగం అధికారిణి చాముండేశ్వరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులకు అర్హమైన ముగ్గులను ఎంపిక చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు 20 ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి కానుకను అందజేశారు.
సంప్రదాయాలను కాపాడుకుందాం
తెలుగు వారికి సంక్రాంతి ఎంతో ఇష్టమైన పండుగ అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీసీ బసిరెడ్డి పేర్కొన్నారు. నేటితరం వారికి పండుగ విశిష్టతను తెలిపేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నానన్నారు.
సృజన శక్తికి ప్రతీక
సంక్రాంతి ముగ్గులు మహిళల సృజనాత్మక శక్తికి ప్రతీకలుగా చెప్పవచ్చని కడప క్రైం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు లోపించడంతోనే సమాజంలో యువత పెడదోవపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమ స్పాన్సర్ శ్రీ గోపాల్ ఆటోస్టోర్స్ యజమాని జ్యూలియస్ మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను కాపాడే పోటీలలో తమకు అవకాశం కల్పించినందుకు సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
నేటి మహిళలను ప్రోత్సహించేందుకు, వారిలో ఆత్మస్థైర్యం, సృజనాశక్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతైనా ఉపయోగపడగలవన్నారు. ప్రపంచ స్థాయిలో 11 ఏళ్లుగా నంబర్ వన్‌గా నిలిచి గిన్నీస్ రికార్డులకెక్కిన హీరో సంస్థ ప్రతినిధులుగా తాము ఈ కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సాక్షి బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే సాక్షి దినపత్రిక అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించడం గర్వంగా ఉందన్నారు. ఎడిషన్ ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సాక్షి ఫ్యామిలీ పేజీతో తెలుగు పాఠకులంతా కుటుంబ సభ్యులు కావడం సంతోషాన్నిస్తోందన్నారు.
బ్యూరో ఇన్‌చార్జి ఎం.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. స్టాఫ్ రిపోర్టర్ బీవీ నాగిరెడ్డి మాట్లాడుతూ సాక్షి పత్రిక ఎప్పటికప్పుడు వినూత్నమైన రీతిలో అవసరమైన వార్తల ప్రచురణతో ముందడుగులో ఉండటానికి కారణం పాఠకుల అభిమానమేనన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంస్థ జనరల్ మేనేజర్ వినాయకా, సేల్స్ మేనేజర్ వెంకటేష్, సేల్స్ టీం ప్రతినిధులు సుబ్బయ్య, సురేష్ పాల్గొన్నారు.
విజేతలు వీరే:
శిరీషాబాయి (ప్రొద్దుటూరు),వి.సుజాత (కడప), వి.అంజలి (కడప) ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఎం.ధనలక్ష్మికి ప్రత్యేక బహుమతి లభించింది. సి.పద్మావతి, వి.విజయలక్ష్మి, జి.రమాదేవి, యు.అరుణ, సుమ, సరోజమ్మ, రమాదేవి, సౌభాగ్యలక్ష్మి, మంజులావాణి, రేణుక, సుమలత, సునీత, నాగజ్యోతి, ప్రవీణ, గాయత్రి, రోహిణి, మాధవి ప్రోత్సాహక బహుమతులు సాధించారు. శ్రీ గోపాల్ ఆటో స్టోర్స్ యజమాని జ్యూలియస్ దంపతులతోపాటు అతిథులు బహుమతులు అందజేశారు.