
‘మత్తు' దందా
ముత్తుకూరు: మత్తు పుట్టించే మందులు, మాత్రల విక్రయాలు ముత్తుకూరులో కాస్త అటూఇటూగా మద్యంతో పోటీపడుతున్నాయి. కొందరు ఆర్‌ఎంపీల సహకారంతో మందుల షాపుల్లో వీటిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అక్రమ మార్గంలో భారీగా సంపాదిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముత్తుకూరు ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్టు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లోని పలు విభాగాల్లో వందలాది మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా బీహార్, ఒడిశా, జార్ఖండ్‌కు చెందిన యువకులు షిఫ్టుల వారీగా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిర్వర్తిస్తున్నారు. శరీర కష్టం తెలియకుండా ఉండేందుకు వీరిలో అనేక మంది మత్తు మందుకు అలవాటుపడ్డారు. అయితే మద్యం సేవించి పనులకు వెళితే కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్ల నుంచి ఇబ్బందులు తప్పవు. దీంతో మత్తునిచ్చే దగ్గుమందు, బీపీ మాత్రలను ఎంచుకుంటున్నారు. స్థానికంగా కొన్ని మందుల దుకాణాలు, పలువురు ఆర్‌ఎంపీలు వీరికి కల్పతరువయ్యారు.
ఇష్టారాజ్యంగా విక్రయాలు
పలు రాష్ట్రాల్లో నిషేధించిన ‘కోరెక్స్’, ‘ఫెన్సిడెల్’ దగ్గు మందులో మత్తు కలిసివుంటుంది. ఒక సీసా మందు తాగితే కావాల్సినంత మత్తు లభిస్తుంది. జేబులో ఇమిడిపోయే వీటిని కొనుగోలు చేసి, దర్జాగా పనుల్లోకి వెళ్తున్నారు. సాధారణంగా వీటి ఖరీదు రూ. 80-90లైతే ఇక్కడ రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ‘ఆల్‌ప్రోజర్-0.5’ మాత్రలు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి రాసిస్తారు.
వీటిల్లో కూడా మత్తు ఉండడంతో అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వైద్యపరిభాషలో వీటిని ‘క్యాటగిరి హెచ్ డ్రగ్స్’ అంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లు రాసిస్తేనే మందుల దుకాణాలు అమ్మకాలు చేయాలి. పరిమితి సంఖ్యలోనే స్టాకు ఉంచుకోవాలి. అయితే కొందరు ఆర్‌ఎంపీలు విచ్చలవిడిగా వీటిని రాసేస్తున్నారు. చీటీలు లేకున్నా కొన్ని దుకాణాలు వేల సంఖ్యలో వీటిని అమ్మకాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ విక్రయాలపై పలువురు ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించకుండానే మందుల దుకాణాల వారి వద్ద మామూళ్లు పుచ్చుకుని వెళ్లారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచ్చలవిడిగా స్టెరాయిడ్స్
ముత్తుకూరు ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసే వారు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో స్థానిక ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జబ్బులు త్వరగా నయం చేశామని రోగుల ఆదరణ చూరగొనేందుకు కొందరు ఆర్‌ఎంపీలు స్టెరాయిడ్స్ కలిసిన మందులను సిఫార్సు చేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌తో పాటు స్టెరాయిడ్స్ కలిగిన ‘సిలిస్ట్రైన్’, ‘ప్రిడ్నిసెల్’ మాత్రలను వాడాలని సూచిస్తున్నారు. అధిక డోసు కలిగిన మందులు ఐదారు రకాలు రాసి, తమకు అనుకూలమైన మందుల షాపులకు ఆదాయం కల్పిస్తున్నారు. అక్షరజ్ఞానం లేని కార్మికులు, గత్యంతరం లేని రోగుల నుంచి ఫీజులు, మందుల రూపంలో వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
పలు మార్లు ఫిర్యాదు చేశాం: రాకేష్‌కుమార్, ఎంబీబీఎస్, ముత్తుకూరు.
గుర్తింపు పొందిన వైద్యులు రాసిన చీటీలు లేకుండా క్యాటగిరి హెచ్ డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. గుర్తింపులేని కొందరు వైద్యులు విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ కలిసిన మందులు రాస్తున్నారు. అసలు జబ్బులు ఎలా ఉన్నా వీటి వల్ల అపాయకరమైన జబ్బులు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై పలు మార్లు ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా, ఎటువంటి మార్పు రాలేదు.
గతంలో తనిఖీలు చేశాం:
శ్రీరామమూర్తి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్
ముత్తుకూరులో మత్తు కలిసిన దగ్గు మందులు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. తనిఖీలు కూడా చేశాము. వాస్తవానికి ముత్తుకూరు ప్రాంతం మా పరిధిలోకి రాదు. గూడూరు డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు చెప్పి, తనిఖీలు చేయిస్తాము. (గూడూరు డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఫోన్ 73829 34368 నంబర్‌కు కాల్ చేయగా, ప్రభుత్వం బిల్లు చెల్లించని కారణంగా ఫోన్ పనిచేయలేదు)