పుల్లలచెరువు మల్లాపాలెంలో వలస వెళ్తున్న కుటుంబాలు (ఫైల్)
చంద్రబాబుతో పాటే కరువూ రావడంతో చినుకు జాడ లేక..సాగు నీరందక పొలాలన్నీ బీళ్లువారుతున్నాయి. ఉన్న ఊళ్లో చేసేందుకు పనుల్లేవు. ఉపాధి హామీ పనులూ అరకొరే. మరి ఇల్లుగడిచేదెట్టా.. పొట్టచేతపట్టుకుని పెట్టా బేడా సర్దుకుని వయసుడిగిన కన్నవాళ్లను ఇళ్ల దగ్గరే వదిలి..భార్యాబిడ్డలతో సుదూర ప్రాంతాలకు వలసెళ్తున్నారు. ఇలా..ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉపాధి కల్పనలో పాలకుల నిర్లక్ష్యం పల్లె జనం పాలిట శాపమవుతోంది.
సాక్షి, చీరాల:
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రాంతంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో కుటుంబ పోషణ కోసం వివిధ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేత పట్టుకుని భార్యబిడ్డలతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, బోధన్, నిర్మల్, ఆర్మూర్ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికీ సుమారు 13 నుంచి 15 వేల మంది వరకు వలసబాట పట్టారు. దీనితో గృహాల వద్ద వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాల్లో ప్రజలు కుటుంబాలను పోషించుకునేందుకు వలసలు వెళ్లారు.
నాలుగేళ్లుగా కరువు పరిస్థితులు రావటం, మార్కాపురం ప్రాంతంలోని పలకల గనుల్లో పనులు లేకపోవటం, పొలాలు పండకపోవటంతో కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారింది. దీంతో ఈ ప్రాంత రైతులు ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్తున్నారు. మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం, కొట్టాలపల్లె, భూపతిపల్లె, బొడిచర్ల, బొందలపాడు, మాల్యవంతునిపాడు, పిచ్చిగుంటపల్లి, మాలపాటిపల్లె, తూర్పుపల్లి, బోడపాడు, తదితర గ్రామాల నుంచి వలసలు వెళ్లారు. అలాగే తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె, మీర్జాపేట, నాగెళ్లముడుపు, కారుమానుపల్లె, చెన్నారెడ్డిపల్లె, తర్లుపాడు, సీతానాగులవరం, కలుజువ్వలపాడు, తుమ్మలచెరువు, కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల, పెదారికట్ల, గొట్లగట్టు, వింజవర్తిపాడు, మర్రిపాలెం, పొదిలి మండలంలోని నందిపాలెం, తలమళ్ల, ఇంకా పలు గ్రామాల ప్రజలు వలసలు వెళ్లారు.
వీరందరూ తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే కాంట్రాక్టర్ల దగ్గర రైల్వే కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, బెంగళూరు నగరంలో వాచ్‌మెన్లుగా, పని మనుషులుగా పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ స్వగ్రామాల్లో ఉంటున్న తల్లిదండ్రులకు నెలకు నాలుగైదు వేల రూపాయలు పంపుతూ నాలుగైదు నెలలకు ఒకసారి వచ్చి వారిని చూసి యోగక్షేమాలు తెలుసుకుని వెళ్తుంటారు. దీంతో వారి పిల్లలు కూడా బడి మానేసి తల్లిదండ్రులతో వెళ్లిపోతున్నారు. గత ఏడాది కూడా మార్కాపురం ప్రాంతంలో వర్షాలు లేకపోవటంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. చెరువులో నీళ్లు రాక తాగునీటి సమస్య ఏర్పడింది.
ప్రతి గ్రామంలో ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఆపదలో ఆదుకునే పాడి పరిశ్రమ కూడా గ్రాసం కొరతతో ఇబ్బందిగా మారిందని పలువురు రైతులు గేదెలను కబేళాలకు అమ్మి వలసలు పోయారు. ఇంటిని చూసుకునేందుకు వృద్ధులైన తల్లిదండ్రులను కాపలాగా ఉంచారు. మార్కాపురం ప్రాంతంలో ఎటుచూసినా చుక్క నీరు లేని చెరువులు బీడు భూములు దర్శనమిస్తున్నాయి. గతంలో పలకల పరిశ్రమ రైతులను, కూలీలను ఆదుకునేది. పలకల పరిశ్రమలో సంక్షోభం రావటంతో ఎగుమతి ఆర్డర్లు లేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దీంతో సుమారు 5 వేల మంది కార్మికులు వీధిన పడ్డారు. వీరందరూ వలస బాట పట్టారు. మరో వైపు భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఆ రంగంలో పని చేసే సుమారు 2 వేల మంది కార్మికులు కూడా వలసలు వెళ్లారు.
వలసలు తప్ప బతికే పరిస్థితి ఏదీ..
పుల్లలచెరువు మండలంలోని పుల్లలచెరువు, వెంకటరెడ్డిపల్లి, రాచకొండ, మల్లాపాలెం, అక్కపాలెం, గంగవరం గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లిక తప్పడం లేదు. ఈ ప్రాంతంలో సాగు నీరు లేక ఇక్కడ పంటలు పండకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇతర జిల్లాలకు చెరుకు నరకడానికో..లేక వరి కోతల కోసమో వెళ్తున్నారు. ఇటీవల వలస వెళ్లి వస్తున్న వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పడు మాచర్ల వద్ద లారీ ప్రమాదానికి గురై చాలా మంది గాయపడ్డారు. ఇటువంటి సంఘటనలు అనేకం. మంచి నాయకుడు వచ్చి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు సక్రమంగా జీవనం సాగించే పరిస్థితి లేదు.
‘మగ్గం’ వదిలి మట్టి పనులకు..
అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన చీరలు నేసే చేనేతల చేతులు ఇప్పుడు మట్టి పని కోసం వెంపర్లాడుతున్నాయి. కన్న బిడ్డల కడుపు నింపేందుకు సిమెంట్, ఇటుకరాళ్లు పట్టి మోసేందుకు పరుగులు పెడుతున్నాయి. మరికొందరు వంటల పని, షెడ్డుల్లో లారీ క్లీనర్ల అవతారం ఎత్తుతున్నారు. మరికొంత మంది కార్మికులు బార్లలో సర్వర్లుగానూ, పెట్రోల్ బంకుల్లో హెల్పర్లుగాను పని చేస్తున్నారు.
పిల్లలను పస్తులుంచలేక..
మగ్గం పనితో అర్థాకలితో భార్య, పిల్లలను పస్తులుంచలేక చేనేత కార్మికులు బేల్దారి పనుల కోసం ఒంగోలు, బాపట్ల, కావలి, చీరాల, ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే చీరాల ప్రాంతంలో ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు రెండు వేల మందికి పైగా చేనేత కార్మికులు మట్టి పనుల కోసం రోజూ ఒంగోలు వెళ్తున్నారు. మరికొంత మంది చీరాల, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో బేల్దారి పనులకు వెళ్తున్నారు. ఈపూరుపాలెం, తోటవారిపాలెం నుంచే వెయ్యి మంది వరకు బేల్దారి పనులకు వెళ్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకే చీరాల రైల్వేస్టేషన్లో చేతిలో క్యారియర్ పట్టుకొని వందలాది మంది చేనేత కార్మికులు పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు వెళ్లేందుకు వేచి ఉంటారు. ఈపూరుపాలెం, జాండ్రపేట, వేటపాలెం స్టేషన్‌లలో కూడా పాసింజర్ రైళ్లు మట్టి పనికి వెళ్లే కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.
పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు..
కనిగిరి నియోజకవర్గంలోనూ వలస జీవులు ఎక్కువే. నియోజకవర్గం నుంచి ఏటా దాదాపు పది వేల మందికిపైగా వలస వెళ్తుంటారు. ఎక్కువగా పీసీపల్లి మండలం అలవలపాడు, వడ్డెరపాలెం, ఇర్లపాడు, సీఎస్‌పురం మండలం అయ్యవారిపల్లి, పెదరాజుపాలెం, డీజీపేట, అంబవరం, చెన్నపనాయునిపల్లి, కె.అగ్రహారం, సీఎస్‌పురం, వడ్డెపాలెం, అయ్యలూరివారిపల్లి, హెచ్‌ఎంపాడు మండలంలోని కొత్తూరు, పాపిరెడ్డిపల్లి, ఉమ్మనపల్లి, మహమ్మదాపురం, రామాయపల్లి, వెలిగండ్ల మండలంలోని మోటుపల్లి, ఇమ్మడిచెరువు, గణేశుని కండ్రిక, రాళ్లపల్లి, పామూరు మండలంలో కంభాలదిన్నె, పామూరు పట్టణం, గోపాలపురం, వగ్గంపల్లి, బోడవాడ, కనిగిరి మండలం వాగుపల్లి, చిన ఇర్లపాడు, వడ్డెపాలెం గ్రామాల నుంచి వలస వెళ్తుంటారు. సీఎస్‌పురం మండలం వాళ్లు బెంగళూరు, పూణె, చెన్నై తదితర నగరాలకు వలస వెళ్లి..బేల్దారి పనులు, చిన్నచిన్న హోటళ్లు నిర్వహించుకుంటుంటారు. మిగిలిన మండలాల వాళ్లు తెలంగాణ జిల్లాలకు వలస వెళ్లి మట్టి పనులు, బేల్దారి పనులు చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment