అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు వరి పంటకు ఊపిరిపోస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా వరి సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో వర్షాలు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంట విస్తారంగా సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. వర్షాలకు తోడు హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో నీరు విడుదల కావడంతో (ప్రస్తుతం కర్ణాటకలో కాలువకు గండి పడటంతో వారం రోజులు నీరు బంద్ చేశారు) ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వేరుశనగ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పండించే పంట వరి మాత్రమే. హెచ్చెల్సీ ఆయకట్టు కింద 60 నుంచి 70 వేల ఎకరాల్లో వరి వేస్తారు. 50 -60 వేల ఎకరాల్లో మాత్రమే ఇతర ఆరుతడి పంటలు సాగవుతాయి.
అయితే.. కొన్నేళ్లుగా వర్షాభావం, తుంగభద్ర డ్యాంలో పూడిక కారణంగా నీటి లభ్యత తక్కువగా ఉందనే నెపంతో హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటల సాగును కుదిస్తున్నారు. గతేడాది ఆరుతడి, తడి పంటలతో కలిపి 60 వేల ఎకరాలకు మాత్రమే నీరివ్వాలని హెచ్చెల్సీ అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. ఈ ఏడాది కర్ణాటకలో వరదలు రావడంతో తుంగభద్ర డ్యాంలోకి భారీగా నీరు చేరింది. దీంతో హెచ్చెల్సీకి సకాలంలో నీరు విడుదల చేశారు. మొత్తం 90 వేల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్చెల్సీ లోకలైజేషన్ ఈఈ ధనుంజయరావు చెప్పారు. ఇప్పటికే హైలెవల్ మెయిన్ కెనాల్‌తో పాటు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్‌కు నీటిని సరఫరా చేస్తున్నారు. త్వరలో మిడ్‌పెన్నార్ నార్త్ కెనాల్‌తో పాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయనున్నారు. ఈ కాలువల కింద ఎక్కువ శాతం వరి సాగు చేయడానికి రైతులు మక్కువ చూపుతున్నారు.
గతేడాది ఆయకట్టుకు నీరు ఆలస్యంగా విడుదల చేయడంతో వరి సాగు గణనీయంగా పడిపోయింది. 23 వేల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. మరో 55 వేల ఎకరాల్లో వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, పప్పుశనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సకాలంలోనే నీరు విడుదల కావడానికి తోడు వరిసాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క హెచ్చెల్సీ ఆయకట్టు కిందే దాదాపు 40వేల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేస్తున్నారు. బోరుబావుల కింద 25 వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశముంది.
వరికి ఊపిరి
Published Sat, Sep 14 2013 4:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement