తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చి నెల గడిచినా... ఈ ప్రక్రియ ముందుకు కదలకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో నైరాశ్యం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది తామే అని ప్రకటన వచ్చిన వారం రోజుల పాటు జోరుగా ప్రచారం చేసుకున్న నేతలు తాజా పరిణామాలతో అప్పటి తీరుగా ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. ప్రకటన వచ్చిన వారంపాటు ఉన్న విజయోత్సవాలు, సన్మానాల స్థానంలో ఇప్పుడు అయోమయం, సందేహాలు నెలకొంటున్నాయి.
సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయమే ఉండడంతో... అప్పటిలోగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయితేనే అనుకూల ఫలితాలు ఉంటాయని, లేకుంటే ఇబ్బందులు తప్పవని అధికారపార్టీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే పూనుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా బిల్లు ప్రక్రియను వేగవంతం చేయకుంటే జిల్లాలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌కు లాభం జరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జూలై 30న కేంద్రంలోని యూపీఏ కూటమి, కాంగ్రెస్ అత్యున్నత విభాగం సీడబ్లూసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి వరుసగా వారం పాటు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు, కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోనూ రెండు వర్గాలు ఉన్న ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సాధనలో తమ కృషిని వివరించేలా కార్యక్రమాలు, మీడి యా సమావేశాలు ఏర్పాటు చేశారు.
వారిని తెలంగాణ ఉద్యోగ, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో సన్మానాలు సైతం అందుకున్నారు. ఇలా వారం పాటు గ్రామస్థాయి కార్యకర్త నుం చి మంత్రి, ఎంపీ వరకు అందరూ ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ సాధించామని ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేది, ఇచ్చేది తామేనని చెప్పామని, దీన్ని నెరవేర్చామని చెప్పుకొచ్చా రు. తెలంగాణ ప్రకటనతో పార్టీకి తిరుగుండదని భావించి పలువురు ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపా రు. సీమాంధ్రలో పరిస్థితులు మారడంతో కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. 2009 లాగానే వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలే ఎక్కువగా ప్రకటనలు ఇస్తుండడంతో తెలంగాణవాదుల్లో మళ్లీ కాంగ్రెస్‌పై నమ్మకం సడలుతోంది. జిల్లా చెందిన ఆ పార్టీ సీనయర్ నేతలు సైతం మునుపటిలా ప్రకటనలు చేయకపోవడం, కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అధికార పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన నైరాశ్యం నెలకొంది.
‘తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఇవ్వలేదని మా పార్టీని, మా పార్టీ నేతలను అందరూ తిట్టారు. తెలంగాణ ప్రకటనతో పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి. ఇక ఎన్నికల్లో తిరుగుండదని భావించాం. నెల రోజులైనా రాష్ట్ర ఏర్పాటు విషయం ముందుకు జరగకపోవడంతో ఇప్పుడు మాకే అనుమానం కలుగుతోంది. తెలంగాణవాదులు, మా కార్యకర్తలు సైతం పార్టీని అనుమానంగానే చూస్తున్నారు. ఎందుకో మాకు ఇంకా పూర్తి నమ్మకం కలగడంలేదు’ అని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.
వచ్చే సాధారణ ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగితేనే తమకు మేలు జరుగుతుందని, లేకుంటే ఇబ్బందులు ఉంటాయని పీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంతోనే తమకు ఇబ్బందులు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. 2009 తర్వాత తెలంగాణ ఇవ్వలేదనే కారణంతో తమకు ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడంలేదని అధికార పార్టీ నేతలే చెబుతుండడంతో కాంగ్రెస్‌లో పరిస్థితి ఎంత అయోమయంగా ఉందో అర్ధమవుతోుంది.
జోష్ తగ్గింది
Published Mon, Sep 2 2013 5:28 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement