మచిలీపట్నం (చిలకలపూడి) : ‘విధినిర్వహణలో రాజీ పడేది లేదు.. గత 14 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా నేను పనిచేసిన ప్రాంతాల్లో ప్రశంసలే తప్ప లోపాలు లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్నయినా అర్హులందరికీ అందేలా కృషి చేయటంలో భాగంగా అధికారులు సహాయసహకారాలు అందించాలి. పనిచేయడానికి బాధపడేవారి విమర్శలు పట్టించుకోను’ సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ చేసిన వ్యాఖ్యలివి. సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న కలెక్టర్‌పై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకు తాను మండల పరిధిలోని కార్యాలయాల్లోనే తనిఖీలు చేశానని, ఇకపై జిల్లా కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తానని చెప్పారు.
పీహెచ్‌సీలు, పాఠశాలల్లో లోపాల గుర్తింపు...
ఇప్పటివరకు తాను చేసిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఎన్నో లోపాలు గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. ముసునూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను నిర్వహించిన తనిఖీల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. మూడు నెలల్లో పది కేసులు మాత్రమే నమోదవుతున్నాయని, ఈ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఉన్నా ప్రజలు రాకపోవడానికి ప్రధాన కారణం వైద్యాధికారులు లేకపోవటమేనని ఆయన చెప్పారు.
ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంత నిధులు ఉన్నాయో నివేదికలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. కొన్ని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గదులు తాళాలు వేసి ఉంటున్నాయని, అవి ఎవరి వద్ద ఉన్నాయని సిబ్బందిని అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారని తెలిపారు. స్మార్ట్ విలేజ్‌లకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించేటప్పుడు కార్యాలయ ప్రధాన అధికారి చాంబర్ నుంచి ఆ కార్యాలయంలో ఉండే మరుగుదొడ్ల నిర్వహణ వరకు పర్యవేక్షణ చేపట్టి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రస్థాయి సమస్యలు ఆన్‌లైన్ చేయాలి...
కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తొలుత రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్‌లైన్ చేయటంపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12 శాఖల సమస్యలు మాత్రమే ఆన్‌లైన్ చేశారని, మిగిలిన శాఖల్లో ఎటువంటి సమస్యలూ లేవా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారిని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన శాఖల అధికారులు కూడా వెంటనే రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్‌లైన్ చేయాలన్నారు.
వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఆయన చెప్పారు. మండలాల ప్రత్యేకాధికారులు మరుగుదొడ్ల నిర్మాణ పనులను అంచెలంచెలుగా పర్యవేక్షించాలన్నారు. ఈ నెల 23 నుంచి మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.చంద్రుడు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీపీవో ఎ.నాగరాజువర్మ, డీఈవో కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.