ఉక్రెయిన్ సేనలు ధ్వంసంచేసిన రష్యా ట్యాంక్
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్‌ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్‌కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు.
యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్‌కు అంగీకరిస్తామని జెలెన్‌స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్‌స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు.
నిలిచిన రష్యా దళాలు
రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్‌లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది.
రూబుల్ చెల్లింపులు చేయం: జీ7
గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్‌లోనే చేయాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్‌కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించే అవకాశముంది. భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్‌వేర్‌కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్‌లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment