ఏడాది క్రితం..
2022 ఫిబ్రవరి 24...
ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు.
దాదాపు ఏడాది గడిచాక...
పసికూనగా భావించిన ఉక్రెయిన్ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే.
తొలిసారేమీ కాదు..
ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్(యూఎస్‌ఎస్‌ఆర్)లో అంతర్భాగమే. సోవియట్ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ కీలుబొమ్మ అని పుతిన్ తరచుగా విమర్శిస్తుంటారు.
ఉక్రెయిన్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో గణనీయంగా ఉన్న రష్యన్ మాట్లాడే ప్రజలు రష్యాకు మద్దతుగా తిరుగుబాటుకు దిగారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమ దేశాల సాయం కోరారు.
రష్యా బారినుంచి కాపాడేందుకు తమను తక్షణం నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తమైంది. అదే జరిగితే నాటో సేనలు ఏకంగా రష్యా సరిహద్దుల్లో తిష్టవేసే ఆస్కారముండటం అధ్యక్షుడు పుతిన్‌కు ఆగ్రహం కలిగించింది. వెంటనే రంగంలోకి దిగి 2021 నవంబర్ నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలించారు. 2022 ఫిబ్రవరికల్లా దాన్ని లక్షకు పెంచి తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీశారు. ఉక్రెయిన్‌పై దాడి తప్పదన్న వార్తల నడుమ, తీవ్ర పరిణామాలు, కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. తమకలాంటి ఉద్దేశం లేనే లేదంటూనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్ సైన్యం మూడువైపుల నుంచీ విరుచుకుపడింది.
శిథిల చిత్రంగా ఉక్రెయిన్
రష్యా దాడుల ధాటికి ఉక్రెయిన్ సర్వం కోల్పోయి శిథిలచిత్రంగా మిగిలింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, మృతదేహాలతో మరుభూమిని తలపించింది. ఐక్యరాజ్యసమితికి శరణార్థుల హై కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2023 జనవరి 15 నాటికి రష్యా దాడుల్లో 7,000కు పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 11 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. వాస్తవానికి కనీసం 50 వేల మందికి పైగా అమాయక పౌరులు యుద్ధానికి బలయ్యారని, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా. 80 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలసవెళ్లారు. వారంతా కట్టుబట్టలతో ఇల్లూ వాకిలీ వదిలి తరలిపోతున్న దృశ్యాలు మానవతకే తీరని మచ్చగా మిగిలాయి. మరో 60 లక్షల మంది స్వదేశంలోనే నిరాశ్రయులయ్యారు.
రష్యా అతలాకుతలం
రష్యా కూడా ఉక్రెయిన్ చేతిలో అవమానకర ఎదురుదెబ్బలు మినహా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బావుకున్నదేమీ లేదు. పైపెచ్చు యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దిగజారింది. అమెరికా, పాశ్చాత్య దేశాల తీవ్ర ఆర్థిక ఆంక్షలతో పూర్తిగా స్తంభించి కుదేలైంది. ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశం వీడాయి. చమురు మినహా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా పడకేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. దాంతో యుద్ధంపై రష్యాలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నడూ లేని రీతిలో పౌరులు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. వేలాదిగా అరెస్టులు జరిగినా వెరవకుండా ఆందోళనలు చేశారు.
దేశాల్లో ఆకలి కేకలు
గోధుమలు, మొక్కజొన్న ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్న రష్యా, ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా తిండి గింజల సరఫరా పూర్తిగా నిలిచిపోయి 50కి పై చిలుకు దేశాలు తీవ్ర ఆహార కొరత బారిన పడి అల్లాడుతున్నాయి. అంతేగాక అటు సంపన్న, ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల ఎంతగానో దెబ్బ తిన్నాయి.
సాహసి... జెలెన్‌స్కీ
రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తనను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కాచుకున్నారు. సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ముందుకొచ్చినా కాదన్నారు. సైన్యంతో కలివిడిగా తిరుగుతూ వారిలో స్థైర్యం నింపారు. ప్రపంచ దేశాలను సాయం కోరుతూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా రష్యాను దునుమాడుతూ సాగారు. పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తిరుగులేని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి హీరో అనిపించుకున్నారు.
ఎవరికెంత నష్టం?
యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటిదాకా తేలకపోయినా ఇరు దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి. లక్షల సంఖ్యలో సైనికులను, వేల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలను కోల్పోయాయి.
ఏ దేశం ఎవరి వైపు...
అమెరికా బ్రిటన్ సహా 30 నాటో సభ్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాయి. వీటితో పాటు మరెన్నో దేశాలు రష్యా దాడిని ఖండించి ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించాయి. ఇక రష్యాకు ప్రధానంగా పొరుగు దేశమైన బెలారస్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉంది. చైనాతో పాటు ఉత్తర కొరియా, క్యూబా, వెనెజువెలా, ఇరాన్, సిరియా, కిర్గిస్తాన్ కూడా రష్యాకు మద్దతు ప్రకటించాయి. యూఏఈ, సౌదీ అరేబియా తటస్థంగా నిలిచినా రష్యా దాడిని ఖండించేందుకు తిరస్కరించాయి. యుద్ధానికి తక్షణం ముగింపు పలికి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నది తొలినుంచీ భారత్ వైఖరిగా ఉంది.
యుద్ధంలో కీలక మలుపులు
ఫిబ్రవరి: 24న యుద్ధం ప్రారంభం. ఉక్రెయిన్ నిస్సైనికీకరణకు సైనిక చర్య ముసుగులో తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి రష్యా ముప్పేట దాడి.
మార్చి: ఖెర్సన్ నగరం స్వాధీనమైందన్న రష్యా. యూరప్‌లోకెల్లా పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ఆక్రమణ. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో అపార నష్టం ధాటికి రష్యా సేనల పలాయనం. రష్యాపై అమెరికా, యూరప్ దేశాల భారీ ఆర్థిక, తదితర ఆంక్షలు.
ఏప్రిల్: కీవ్, బుచాల్లో వందలాది పౌరులను రష్యా సైన్యం చిత్రహింసల పాలు చేసి చంపినట్టు వెల్లడి. రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు మోపాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు. ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి. రష్యా యుద్ధ నౌక మాస్క్‌వాను క్షిపణి దాడితో నల్లసముద్రంలో ముంచి సంబరాలు చేసుకున్న ఉక్రెయిన్.
మే: మారియుపోల్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా. రష్యా దూకుడు పట్ల ఆందోళనతో నాటోలో చేరుతామంటూ దరఖాస్తు చేసుకుని పుతిన్‌కు షాకిచ్చిన ఫిన్లండ్, స్వీడన్.
జూన్: ఉక్రెయిన్ దాడుల దెబ్బకు యుద్ధం మొదట్లో నల్లసముద్రంలో ఆక్రమించిన స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలిగిన రష్యా సేనలు.
జూలై: ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రేవు పట్టణాల నుంచి ఆహార ధాన్యాల సరఫరా.
ఆగస్టు: క్రిమియాపై ఉక్రెయిన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న రష్యా వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలు.
సెప్టెంబర్: ఖర్కీవ్‌లో ఆకస్మిక దాడులతో రష్యా దళాలను తరిమికొట్టిన ఉక్రెయిన్ సైన్యం. రిఫరెండం ముసుగులో డొనెట్స్‌క్, లుహాన్స్‌క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు పుతిన్ ప్రకటన.
అక్టోబర్: క్రిమియాను రష్యాతో కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్.
నవంబర్: రష్యాకు పరాభవం. దాడులకు తాళలేక ఖెర్సన్ నగరం నుంచి పుతిన్ సేనల పలాయనం.
డిసెంబర్: రష్యాలోని సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలపై దాడులు, భారీ నష్టం.
2023 జనవరి: మకీవ్కాలో క్షిపణి దాడులతో వందలాది మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్. 89 మంది మరణించారన్న రష్యా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment