కైవ్: రష్యా ధాటికి ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. పుతిన్ సైన్యం అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. రష్యా సైనిక దాడుల్లో 137 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు. మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడియర్ జెలెన్స్కీ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాను ఎదుర్కొనేందుకు తాము ఒంటిరిగానే పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. కానీ, మా దేశం నుండి రష్యా దళాలను వెనక్కి పంపడానికి మా బలం, బలగం సరిపోదు. దృఢమైన సంకల్పంతోనే అది సాధ్యమవుతుందని దేశ ప్రజలు, సైనికుల్లో ధైర్యం నింపారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌లోని ఘటనలను గమనిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలను తగ్గించడానికి మాస్కోపై విధించిన ఆంక్షలు సరిపోవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రష్యా బలగాలు కైవ్‌ను సమీపిస్తున్నాయన్న తరుణంలో ఉక్రెయిన్ సైనికులు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఓ బంకర్‌లో దాచిపెట్టారు.
పుతిన్ హెచ్చరిక..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తూనే మరోసారి దాని మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఏ దేశమైన చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రజలపై దాడి చేయడం తమ లక్ష్యం కాదని, తమ పౌరులను, సైనికులను రక్షించుకునేందుకే దాడులు చేస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. యూకే, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్‌తో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులను ఖండించాయి. ఈ క్రమంలోనే రష్యాపై తీవ్ర ఆర్ధిక ఆంక్షలను సైతం విధించాయి. నాటో సభ్య దేశాల జోలికి వస్తే ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment