కంపెనీ టేకోవర్ లాంచనాలకు ముందు ప్రధాని మోదీతో సమావేశమైన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
2021 అక్టోబర్‌లో...
గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు.
‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఎస్‌ఐబీ కన్సార్షియం నుంచి రుణం
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్‌బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు.
టాటా వయా న్యూఢిల్లీ టు టాటా
టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్‌జీ దాదాబాయ్ (జేఆర్‌డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి...
► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు.
► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు.
► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది.
► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు.
► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది.
► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది.
► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది.
► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు.
► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ.
► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది.
► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి.
► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.
► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది.
► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది.
విమానయానం బలపడుతుంది
ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది.
ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది.
– జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం.
– ఎయిరిండియా ప్రకటన
కొత్త అధ్యాయం ప్రారంభం
నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌లైన్‌ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది.
– ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్
Comments
Please login to add a commentAdd a comment