Assignment
-
ఇక టాటావారి ఎయిరిండియా
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021 అక్టోబర్‌లో... గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు. ‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఎస్ఐబీ కన్సార్షియం నుంచి రుణం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు. టాటా వయా న్యూఢిల్లీ టు టాటా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి... ► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు. ► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. ► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది. ► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది. ► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది. ► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు. ► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ. ► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది. ► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి. ► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. ► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది. విమానయానం బలపడుతుంది ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది. – జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం. – ఎయిరిండియా ప్రకటన కొత్త అధ్యాయం ప్రారంభం నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌లైన్‌ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
మనసు దోచుకుంటున్న స్కూల్ లెటర్
చెన్నై : విద్య వ్యాపారంగా మారిన నేటికాలంలో ఎప్పుడూ మార్కులు.. ర్యాంకులు..అంటూ విద్యార్థుల వెంటపడే పాఠశాల, కళాశాల గురించే మనం విన్నాం. కొన్ని పాఠశాలలైతే సెలవుల్లోనూ విద్యార్థులకు హోం వర్క్ ఇస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలవుల్లో మనకు ఇష్టమైన వారితో గడుపుతూ సెలవులను ఆస్వాదించాలంటూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. చెన్నైలోని అన్నై వయోలెట్ మెట్రిక్ స్కూల్ వేసవి సెలవుల్లో భాగంగా హాలిడే అసైన్మెంట్ పేరిట తల్లిదండ్రులకు ఓ లేఖ పంపింది. హాలిడే అసైన్మెంట్ ఇదే.. తల్లిదండ్రులు రోజుకు రెండుసార్లు తమ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. అంతేకాదు వారికి రైతుల కష్టం విలువ కూడా తెలియజెప్పుతూ ఆహారం వృధా చేయకూడదనే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పాలి. బామ్మాతాతయ్యలతో, ఇరుగుపొరుగు వారితో బంధం పెంచుకొనేలా వారిని ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం, జంతువులతో ఆడుకోవడం వంటి అలవాట్లను నేర్పించాలంటూ.. ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలతో లేఖను నింపారు. ఆ రోజులు వేరు.. స్కూలు ప్రిన్సిపల్ లిదియా దైవసహాయం మాట్లాడుతూ.. ‘మా చిన్నతనంలో సెలవులంటే ఎగిరి గంతేసేవాళ్లం. ఆటపాటలతో హాయిగా గడిపే వాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చదువే లోకంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా సంపాదనలో మునిగిపోయి పిల్లలతో సమయం గడపలేకపోతున్నారు. అందుకే ఈసారి మేము ఇలా ప్లాన్ చేశామంటూ’ వివరించారు. -
అసైన్డ్‌పై గద్దలు!
►పరాధీనమవుతున్న వందల ఎకరాల అసైన్డ్ భూమి ►నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లు ►అధికారుల అండతో రెచ్చిపోతున్న బడాబాబులు ►చేతులు మారుతున్నా పట్టించుకోని యంత్రాంగం ►ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలదే కీలకపాత్ర..! ►కేవలం నోటీసులతోనే సరిపుచ్చుతున్న ప్రభుత్వం ►విలువైన భూములను కాపాడుకోవడంపై నిర్లక్ష్యం ఇటీవల శంషాబాద్ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్ మండలం గిర్మాపూర్ మొదలు అనేక చోట్ల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు తేలింది. ఈ క్రమంలోనే రోజుకోతీరుగా మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,15,218 మంది భూమిలేని నిరుపేదలకు 1,58,646.25 ఎకరాల మేర భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. దీనిని కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ చేతులు మారినా.. ఇతరత్రా అవసరాలకు మార్పు చేసినా పీఓటీ చట్టం కింద అసైన్మెంట్ను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికుంది. ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవని తెలిసినా యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. నగరీ కరణతో భూముల విలువలు నింగినంటాయి. దీంతో అసైన్డ్ భూములు కూడా పరాధీనమవుతున్నాయి. అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అక్రమార్కులు ఎగురేసుకుపోతున్నా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పీఓటీ చట్టం–1977 కింద వెనక్కి తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటోంది. అసైనీల స్థానే బినామీలు పుట్టుకొస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూముల ధరలు పెరిగిపోవడంతో అసైన్డ్ భూములపై కన్నేసిన బడాబాబులు, ప్రజాప్రతినిధులు పేద రైతులను నయానో భయానో ఒప్పించి వాటిల్లో పాగా వేస్తున్నారు. కారుచౌకగా లభించే ఈ భూములను కొందరు ఫామ్హౌస్లుగా మార్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం విద్యాసంస్థలు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ప్లాట్లు చేసి విక్రయించేస్తున్నారు. ఈ తతంగమంతా బహిరంగంగానే జరుగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగానికి మాత్రం కనిపించదు. ప్రభుత్వ పెద్దలు సైతం ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తుండడంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించదు. అక్రమ రిజిస్ట్రేషన్లు! ప్రభుత్వ భూములుగా పరిగణించే వీటిని 22ఏ కింద నిషేధిత జాబితాలో పొందుపరిచింది. ఈ భూముల క్రయ విక్రయాలు జరుగకుండా నిరోధిస్తూ ఈ జాబితాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు పంపింది. అయినప్పటికీ గుట్టుగా భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ భూములు ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి. రియల్టర్లు, బడాబాబులతో మిలాఖత్ అయిన కొందరు సబ్రిజిస్ట్రార్లు వీటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తుండడం గమనార్హం. ఇటీవల శంషాబాద్ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్ మండలం గిర్మాపూర్ మొదలు అనేక చోట్ల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు తేలింది. కోర్టు కేసులను సాకుగా చూపి విలువైన ఈ భూములను ఎగురేసుకుపోతుండడంతో రెవెన్యూయంత్రాంగం చేష్టలుడిగిచూస్తోంది. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం గతేడాది వరకు పరాధీనమైన 3,553 ఎకరాలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆయా భూముల్లో బోర్డులు నాటినప్పటికీ, చాలా చోట్ల పొజిషన్లో మాత్రం ఆక్రమణదారులే కొనసాగుతుండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో పేదలు భూములు అమ్ముకోవడం.. అమాయక రైతులు కొని మోసపోగా.. శివార్లలో మాత్రం పలుకుబడి గల సంపన్నవర్గాలు ఈ భూముల్లో తిష్ట వేశాయి. ముఖ్యంగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, బాలాపూర్, కందుకూరు మండలాల్లో అసైన్డ్ భూములు పెద్దల గుప్పిట్లోకి వెళ్లాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. దీనికితోడు న్యాయపరమైన వివాదాలు కూడా అడ్డువస్తుండడం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం కష్టమవుతోంది. -
విధినిర్వహణలో రాజీ ప్రసక్తే లేదు
మచిలీపట్నం (చిలకలపూడి) : ‘విధినిర్వహణలో రాజీ పడేది లేదు.. గత 14 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా నేను పనిచేసిన ప్రాంతాల్లో ప్రశంసలే తప్ప లోపాలు లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్నయినా అర్హులందరికీ అందేలా కృషి చేయటంలో భాగంగా అధికారులు సహాయసహకారాలు అందించాలి. పనిచేయడానికి బాధపడేవారి విమర్శలు పట్టించుకోను’ సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ చేసిన వ్యాఖ్యలివి. సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న కలెక్టర్‌పై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకు తాను మండల పరిధిలోని కార్యాలయాల్లోనే తనిఖీలు చేశానని, ఇకపై జిల్లా కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తానని చెప్పారు. పీహెచ్‌సీలు, పాఠశాలల్లో లోపాల గుర్తింపు... ఇప్పటివరకు తాను చేసిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఎన్నో లోపాలు గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. ముసునూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను నిర్వహించిన తనిఖీల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. మూడు నెలల్లో పది కేసులు మాత్రమే నమోదవుతున్నాయని, ఈ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఉన్నా ప్రజలు రాకపోవడానికి ప్రధాన కారణం వైద్యాధికారులు లేకపోవటమేనని ఆయన చెప్పారు. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంత నిధులు ఉన్నాయో నివేదికలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. కొన్ని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గదులు తాళాలు వేసి ఉంటున్నాయని, అవి ఎవరి వద్ద ఉన్నాయని సిబ్బందిని అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారని తెలిపారు. స్మార్ట్ విలేజ్‌లకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించేటప్పుడు కార్యాలయ ప్రధాన అధికారి చాంబర్ నుంచి ఆ కార్యాలయంలో ఉండే మరుగుదొడ్ల నిర్వహణ వరకు పర్యవేక్షణ చేపట్టి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి సమస్యలు ఆన్లైన్ చేయాలి... కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తొలుత రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్లైన్ చేయటంపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12 శాఖల సమస్యలు మాత్రమే ఆన్లైన్ చేశారని, మిగిలిన శాఖల్లో ఎటువంటి సమస్యలూ లేవా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారిని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన శాఖల అధికారులు కూడా వెంటనే రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్లైన్ చేయాలన్నారు. వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఆయన చెప్పారు. మండలాల ప్రత్యేకాధికారులు మరుగుదొడ్ల నిర్మాణ పనులను అంచెలంచెలుగా పర్యవేక్షించాలన్నారు. ఈ నెల 23 నుంచి మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.చంద్రుడు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీపీవో ఎ.నాగరాజువర్మ, డీఈవో కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూరగడ
ధర్మపురి : అధికారుల నిర్లక్ష్యంతో అటవీ గ్రామాల్లో భూసంబంధమైన వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. అసైన్మెంట్, అటవీ భూములకు ఎలాంటి హద్దులు నిర్ణయించకపోవడంతో గిరిజనులు ఎవరికి వారు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భూమి తమదంటే తమదని దాడులు చేసుకుంటున్నారు. ఇదే కోవలో గురువారం మండలంలోని తుమ్మెనాలలో 564 కంపార్టుమెంటులో సుమారు 50ఎకరాల అటవీ భూమి తమదంటే తమదని తుమ్మెనాలవాసులు, పెద్దనక్కలపేట పరిధిలోని బోదరగూడానికి చెందిన గిరిజనులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఫారెస్టు సెక్షన్ అధికారి బాపురాజు, సర్వేయర్ చంద్రయ్య రెండు గ్రామాలకు హద్దులు నిర్ణయిస్తుండగా వివాదం చెలరేగింది. సదరు భూమిలో బోదరగూడానికి చెందిన గిరిజనులు మూడు రోజులుగా చెట్టు నరుకుతూ సాగుకు యోగ్యంగా మలుచుకుంటున్నారు. ఇందుకు తుమ్మెనాలవాసులు అభ్యంతరం చెబుతున్నారు. ఆభూమి గ్రామ పరిధిలోనే ఉందని, గ్రామస్తులకే చెందాలని పట్టుబడుతూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వేయర్ వచ్చి హద్దులు నిర్ణయిస్తుండగా బోదరగూడెం గిరిజనులు వచ్చి అడ్డుకున్నారు. తుమ్మెనాలవాసులు కూడా ఎదురు తిరిగారు. ఒకరినొకరు తోసేసుకున్నారు. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో బోదరగూడానికి చెందిన తట్ల శంకర్, తట్ల నర్సవ్వ, తుమ్మెనాలకు చెందిన రేని మల్లవ్వ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకు ముందే కొందరు గిరిజనలు పోలీసులకు సమస్య వివరించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అటవీ భూములు తమకే చెందాలని గిరిజనలు, తుమ్మెనాలకే చెందాలని వీఎస్ఎస్ చైర్మన్ పద్మాకర్, ఉపాధ్యక్షుడు మల్లేశం పట్టుబట్టారు. -
భూపంపిణీకి శ్రీకారం
=పూర్తయిన అసైన్మెంట్ కమిటీ సమావేశాలు =జిల్లాలో 4137 మందికి 5129.53 ఎకరాలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేదలకు శుభవార్త. ఏళ్ల తరబడి తమ అధీనంలోని భూములకు ఎట్టకేలకు హక్కుదారులు కానున్నారు. జిల్లాలో ఏడో విడత భూ పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో అసైన్మెంట్ సమీక్ష కమిటీ సమావేశాలు గురువారంతో ముగిశాయి. జిల్లాలో 22 మండలాల్లో 4137 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి 5129.53 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏడో విడతలో కేవలం 22 మండలాల్లోనే భూములను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 43 మండలాల్లో అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ ప్రకారం భీమిలి, పద్మనాభం, ఆనందపురం, సబ్బవరం, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, పెదగంట్యాడ, గాజువాక, పెందుర్తి, పరవాడల్లో భూములను అసైన్ చేసే అవకాశం లేదు. అలాగే అనకాపల్లి జీవీఎంసీలో విలీనమవడం, నర్సీపట్నం, యలమంచిలిలు మున్సిపాలిటీలు కావడంతో ఈ మండలాల్లో కూడా భూములు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నిన్న మొన్నటి వరకు మిగిలిన 30 మండలాల్లో పేదలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. అయితే పీసీపీఐఆర్ పేరుతో ఏడు మండలాల్లో భూములను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ కారిడార్ పరిధిలో తీర ప్రాంతాలైన అర్బన్‌లో పెదగంట్యాడ, పరవాడ రెండు మండలాలను కలుపుకొని ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట ఇలా ఏడు మండలాలున్నాయి. అర్బన్‌లో ఉన్న రెండు మండలాలు మినహా, మిగిలిన అయిదు మండలాల్లో భూములను నోటిఫై చేసింది. ఫలితంగా ఈ భూములను కూడా పేదలకు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ 11 మండలాల్లో పాడేరు, పెదబయలు, జీకే వీధి, డుంబ్రిగూడ మండలాల్లో భూములు లేవంటూ గిరిజనులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు. 31లోగా భూ పంపిణీ ఏడో విడతలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో 8 మండలాల్లో 1570.21 ఎకరాలను 1887 లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ నెల 24న మునగపాకలో 167 మంది లబ్ధిదారులకు 133 ఎకరాలను పంపిణీ చేశారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఆరు మండలాల్లో 1359 లబ్ధిదారులకు 1655.73 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించనున్నారు. అలాగే పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాల్లో 1903.59 ఎకరాలను 891 మందికి ఇవ్వనున్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.