భూపంపిణీకి శ్రీకారం
=పూర్తయిన అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు
=జిల్లాలో 4137 మందికి 5129.53 ఎకరాలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేదలకు శుభవార్త. ఏళ్ల తరబడి తమ అధీనంలోని భూములకు ఎట్టకేలకు హక్కుదారులు కానున్నారు. జిల్లాలో ఏడో విడత భూ పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో అసైన్‌మెంట్ సమీక్ష కమిటీ సమావేశాలు గురువారంతో ముగిశాయి. జిల్లాలో 22 మండలాల్లో 4137 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి 5129.53 ఎకరాలను పంపిణీ చేయనున్నారు.
శుక్రవారం నుంచి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏడో విడతలో కేవలం 22 మండలాల్లోనే భూములను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 43 మండలాల్లో అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ ప్రకారం భీమిలి, పద్మనాభం, ఆనందపురం, సబ్బవరం, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, పెదగంట్యాడ, గాజువాక, పెందుర్తి, పరవాడల్లో భూములను అసైన్ చేసే అవకాశం లేదు. అలాగే అనకాపల్లి జీవీఎంసీలో విలీనమవడం, నర్సీపట్నం, యలమంచిలిలు మున్సిపాలిటీలు కావడంతో ఈ మండలాల్లో కూడా భూములు ఇచ్చే పరిస్థితి లేదు.
దీంతో నిన్న మొన్నటి వరకు మిగిలిన 30 మండలాల్లో పేదలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. అయితే పీసీపీఐఆర్ పేరుతో ఏడు మండలాల్లో భూములను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ కారిడార్ పరిధిలో తీర ప్రాంతాలైన అర్బన్‌లో పెదగంట్యాడ, పరవాడ రెండు మండలాలను కలుపుకొని ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట ఇలా ఏడు మండలాలున్నాయి. అర్బన్‌లో ఉన్న రెండు మండలాలు మినహా, మిగిలిన అయిదు మండలాల్లో భూములను నోటిఫై చేసింది. ఫలితంగా ఈ భూములను కూడా పేదలకు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ 11 మండలాల్లో పాడేరు, పెదబయలు, జీకే వీధి, డుంబ్రిగూడ మండలాల్లో భూములు లేవంటూ గిరిజనులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు.
31లోగా భూ పంపిణీ
ఏడో విడతలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో 8 మండలాల్లో 1570.21 ఎకరాలను 1887 లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ నెల 24న మునగపాకలో 167 మంది లబ్ధిదారులకు 133 ఎకరాలను పంపిణీ చేశారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఆరు మండలాల్లో 1359 లబ్ధిదారులకు 1655.73 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించనున్నారు. అలాగే పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాల్లో 1903.59 ఎకరాలను 891 మందికి ఇవ్వనున్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.