డ్వాక్రా సంఘాలకు ఇసుక మైనింగ్!
ఆలోచిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇసుక మైనింగ్‌పై సీఎం సమీక్ష
హైదరాబాద్: ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. నూతన ఇసుక తవ్వకం విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే అంశంపై చర్చ జరిగింది. ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తే మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరుగుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయం పెరిగేలా ఇసుక కొత్త విధానంలో మార్పులు చేయాలని సూచించారు. రాష్ర్టంలో ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కొత్త రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఆదాయానికి గండిపడకుండా చూడాలని చెప్పారు.
ఇసుక క్వారీయింగ్‌కు తమిళనాడు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని, సీసీ టీవీలతో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించారు. ఇసుక కేటాయింపులో వినియోగదారులకు తొలి ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ ప్రాజెక్టులు, పనులకు తరువాతి ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పనులకు 200 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుందని, ప్రైవేటు అవసరాలకు 175 లక్షల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. సమావేశంలో గనులశాఖ మంత్రి పి.సుజాత, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, పరిశ్రమలశాఖ సీనియర్ అధికారి జేఎస్‌వీ ప్రసాద్ , గనులశాఖ సంచాలకుడు సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.