
డ్వాక్రా మహిళలకు బ్యాంకు నోటీసులు
లక్కవరపుకోట : అంతా అనుకున్నట్టే జరిగింది. ఎన్నికలకు ముందు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో ప్రజలు టీడీపీని గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతు, డ్వాక్రా రుణ మాఫీలపై రోజుకు మాట చెప్పిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు ఈ నెల 21న క్యాబినెట్ సమావేశంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు, డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే బ్యాంకర్లు మాత్రం రుణాలు కట్టని డ్వాక్రా సభ్యులకు నోటీసులు పంపిస్తున్నారు.
లక్కవరపుకోటలోని ఏపీజీవీబీ సిబ్బంది 24వ తేదీ నుంచి డ్వాక్రా సంఘ సభ్యులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏడు రోజుల్లో కట్టని ఎడల క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఏపీజీవీబీలో పట్టణానికి చెందిన గణేష్ మహిళా సంఘ సభ్యులు 2012 సెప్టెంబర్‌లో 4,20,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత ఎన్నికల నేపథ్యంలో వచ్చిన హామీలతో కొన్ని నెలలు వాయిదాలు కట్టలేదు. దీంతో 1,67,920 రూపాయలు వెంటనే కట్టాలని సంఘ సభ్యులకు గురువారం నోటీస్ అందింది.
అలాగే దివ్య మహిళా సంఘ సభ్యులకు కూడా 1,85,076 రూపాయలు చెల్లించాలని నోటీసులు అందాయి. దీంతో మహిళా సంఘ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నోటీసులు ఎందుకు పంపిస్తున్నారో అర్థం కావడం లేదని లబోదిబోమంటున్నారు. మండల కేంద్రంలోని ఒక్క ఏపీజీవీబీ నుంచే 131 సంఘాలకు సంబందించి కోటీ 78 లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపినట్లు బీఎం జె. సూర్యకిరణ్ తెలిపారు.
మోసపోయాం
ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు రుణాలు చెల్లించలేదు. తీరా ఇప్పుడు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు. బాబు మాటలు నమ్మి మోసపోయాం.
- గణేష్ మహిళా సంఘ సభ్యులు
ఆదేశాలు రాలేదు
డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. రుణాలు చెల్లించని వారికి నోటీసులు పంపిస్తున్నాం. ఏడు రోజుల్లో చెల్లించని వారిపై చర్యలు తప్పవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే రద్దుకు చర్యలు తీసుకుంటాం.
- జె.సూర్యకిరణ్, ఏపీజీవీబీ బీఎం, లక్కవరపుకోట