డ్వాక్రా రుణమాఫీపై అట్టుడికిన సభ | Dwarka Assembly on the issue of loan waiver | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణమాఫీపై అట్టుడికిన సభ

Published Wed, Mar 11 2015 2:06 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

డ్వాక్రా రుణమాఫీపై అట్టుడికిన సభ - Sakshi

డ్వాక్రా రుణమాఫీపై అట్టుడికిన సభ

వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం.. నోటీసు తిరస్కరించిన స్పీకర్
 
హైదరాబాద్: డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన వాయి దా తీర్మానం నోటీసును స్పీకర్ తిరస్కరించడంతో మొదలైన నిరసన.. సభ వాయిదాలు, వాకౌట్ల దాకా కొనసాగింది. ఈ మధ్యలో అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, నిరసనలు, నినాదాలు, ప్లకార్డులు, పోడియం ముట్టడి, పరస్పర ఆరోపణలు వంటివి చోటుచేసుకున్నాయి. నిరసన వెలిబుచ్చిన విపక్షాన్ని పాలకపక్షం మరింత రెచ్చగొట్టే తీరులో వ్యవహరించింది. అతి ముఖ్యమైన సమస్యను ప్రస్తావించడానికీ సమయం దొరకని సభను ఏమని అభివర్ణించాలో అర్థం కావట్లేదని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఇది సభా? కౌరవసభా? అని ప్రశ్నించారు. సభ ప్రారంభంలోనే వైఎస్సార్‌సీపీ సభ్యురాలు జి.ఈశ్వరి ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్ కోడెల తిరస్కరించారు.

డ్వాక్రా రుణాల మాఫీ అత్యవసరమైన సమస్యేమీ కాదని, సరైన రూపంలో వస్తే చర్చించవచ్చని స్పీకర్ చేసిన సూచనతో వైఎస్సార్‌సీపీ సభ్యులు అంగీకరించలేదు. మహిళలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్య సమస్యని, దీనిపై తక్షణమే చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో సభ్యులు‘డ్వాక్రా రుణాలు తక్షణమే మాఫీ చేయాలి’ అని రాసున్న ప్లకార్డులతో సభ మధ్యలో నిరసన తెలిపారు. ‘మహిళాద్రోహి చంద్రబాబు డౌన్‌డౌన్’, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు. మహిళల్ని బాబు వంచిస్తున్నారంటూ స్పీకర్ ఎదుట నిరసన తెలిపారు.

స్పీకర్‌తో వాగ్వాదం, సభ తొలి వాయిదా

ఈ దశలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విపక్ష సభ్యులు సభాసమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యా నించారు. డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. దీంతో విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంవైపు దూసుకుపోయారు. కోడెలతో వాగ్వాదానికి దిగడంతో ప్రారంభమైన తొలి 4 నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. అయినా సభ్యులు పోడియం వద్దే నిలబడి ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు చేశారు.
 
మైక్ అలా ఇచ్చి, ఇలా కట్ చేసి...


అనంతరం స్పీకర్ అనుమతితో జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ... డ్వాక్రా మహిళల సమస్యకు ఎందుకింత ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందంటే బాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,204 కోట్ల రుణాలున్నాయంటూ అంటుండగానే మైక్ కట్ అయింది. వాయిదా తీర్మానం నోటీసును తిరస్కరించాక అదే అంశాన్ని ప్రస్తావిస్తే ఎలా? అని స్పీకర్ చెప్పబోతుండగా విపక్షం తీవ్ర నిరసన తెలిపింది. మళ్లీ విపక్షనేతకు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఉన్న రుణాల్లో కేవలం రూ.వేయి కోట్లే రెన్యువల్ అయ్యాయి’’ అంటుండగానే స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. ఈ దశలో విపక్ష సభ్యులు ఆగ్ర హంతో పెద్దగా నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ధైర్యముంటే చర్చకు రావాలని, తిరస్కరించిన తీర్మానంపై పట్టుబట్టడం సంప్రదాయం కాదన్నారు.
 
మహిళలకు జరిగే నష్టం ఎలాగంటే..


ఆ తర్వాత స్పీకర్ అనుమతితో జగన్ మాట్లాడుతూ ‘‘ఇంత ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి 5 నిమిషాలన్నా పట్టదా? అందుకూ సిద్ధంగా లేరా? దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. కౌరవసభను తలపిస్తోందని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. వినండి. డ్వాక్రా మహిళలకిచ్చిన రుణాలు రూ.14,204 కోట్లు, వీటిల్లో పునరుద్ధరణ(రెన్యువల్) అయినవి కేవలం రూ.వేయి కోట్లు. ఈ ఏడాది మరో రూ. రెండు వేల కోట్లు కొత్తగా రుణాలిచ్చారు. అంటే ఈ మూడు వేల కోట్ల రూపాయలపై 12.5 శాతం వడ్డీ పడుతోంది. మిగిలిన రూ.13,204 కోట్లకు 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. ఇదంతా డ్వాక్రా మహిళలపై పడుతున్న భారం’’ అని చెబుతుండగా పాలకపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. గందరగోళం పరిస్థితుల్లో స్పీకర్ సభను రెండోసారి ఉదయం 9.46 గంటలకు సభను వాయిదా వేశారు. మళ్లీ పదిన్నరకు సభ ప్రారంభమవగానే విపక్ష సభ్యులు మళ్లీ చర్చకు పట్టుబట్టారు.

నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన సమయంలోనే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ హత్యకేసుపై ప్రకటన చేశారు. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విపక్షాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో విపక్షానికి, పాలకపక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో స్పీకర్ 10.45కి మూడోసారి సభను వాయిదా వేశారు. తిరిగి సభ 11.10కి ప్రారంభమైనప్పుడూ  విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమిస్తానని స్పీకర్ చెప్పడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నారు. అయితే జగన్ ఒకట్రెండు వాక్యాలు పూర్తి చేయకముందే మళ్లీ మైక్ కట్ చేశారు. వాయిదా తీర్మానంపై ఎందుకు చర్చ చేపట్టాలనే విషయాన్ని చెప్పడానికి కూడా ఐదు నిమిషాల సమయమివ్వనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
 
మళ్లీ మళ్లీ మైక్ కట్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలుమార్లు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మైక్ కట్‌చేయడం మంగళవారం శాసనసభలో పలుమార్లు జరిగింది.  డ్వాక్రా మహిళల రుణమాపీ అంశంపై వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించగా.. దాని ప్రాధాన్యం గురించి వివరించడానికి 5 నిమిషాల సమయమివ్వాలని మంగళవారం సభ ప్రారంభం నుంచి విపక్ష నేత జగన్ పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మాట్లాడమని అవకాశమిచ్చి  ఆయన ప్రసంగం మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేయడం పలుమార్లు జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికీ ఇదే పరిస్థితి.

దీనికి విపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ‘‘15 రోజులక్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు హోంమంత్రి ప్రకటన చేశారు. దాన్ని విపక్షానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపక్ష సభ్యులు క్లారిఫికేషన్లకు అవకాశమిచ్చి ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వకపోవడం ఏం సంప్రదాయం? ఇదేం సభ?’ అని ప్రశ్నించారు. విపక్ష నేత ప్రశ్నల పరంపర కొనసాగుతుండగానే మళ్లీ మైక్ కట్ అయింది. విపక్షం గొంతు నొక్కడానికి ఎన్నిసార్లు మైక్ కట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఆఖరు అరగంటలో మినహా.. విపక్ష నేతకు మైక్ కట్ చేయకుండా కాసేపు కూడా మాట్లాడే అవకాశం లభించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement