
పింఛన్ల పంపిణీ బాధ్యత డ్వాక్రా మహిళలకు
జులై నుంచిఅమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం
కర్నూలు(హాస్పిటల్): రాష్ర్టంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం మారబోతోంది. పంచాయతీ కార్యదర్శుల నుంచి డ్వాక్రా మహిళల చేతుల్లోకి పంపిణీ వెళ్లబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రబ్యాంకుచే ఒప్పందం కుదుర్చుకొని జులై ఒకటి నుంచి ఈ విధానాన్ని అమలుల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద జిల్లాలో వృద్దులు, వికలాంగులు, వితంతవులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వికలాంగుల్లో కొందరికి మినహా మిగిలిన వారందరికీ నెలకు రూ.1000ల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఈ మేరకు జిల్లాలో 3,11,977 మందిని గుర్తించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియే మొదట్లో వివాదాస్పదంగా మారింది. అనర్హుల పేరుతో అర్హులైన వారిని వేలల్లో తొలగించారు. జాబితాలో ఉన్న వారికి మొదట్లో పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేసేవారు. ఈ విధానం విఫలం కావడంతో బ్యాంకుల ద్వారా అందజేశారు. ఇది కూడా ఆశించినంత విజయవంతం కాలేదని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటిల్లో బిల్ కలెక్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే నెలలో 10 రోజులు వీరు పింఛన్ల పంపిణీకే సమయం కేటాయిస్తుండటంతో ఉద్యోగ రీత్యా వారు నిర్వర్తించాల్సిన పనులు ఆగిపోతున్నాయి. దీంతో మొదటి మూడు రోజుల్లోనే పింఛన్ల ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.
బిజినెస్ కరస్పాండెంట్లుగా డ్వాక్రా మహిళలు
పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లచే పంపిణీకి బదులు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బిజినెస్ కరస్పాండెంట్లను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు ఆయా బ్యాంకులకు ఆ బాధ్యతలను అప్పగించనుంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా ఎవరినో నియమించే బదులు డ్వాక్రా మహిళలనే నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంకుచే ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లాలో డ్వాక్రా మహిళలను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించి, వారిచే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి.