మాయాజాలం
అనంతపురం సెంట్రల్ : పామిడి మున్సిపాలిటీలోఈ నెల 21న మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళల నుంచి నిరసన గళం వ్యక్తమయ్యింది. రుణమాఫీ అంటూ సభ్యురాలికి రూ.3 వేలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సభ్యురాలికి రూ.10 వేల చొప్పున వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయాలని డిమాండ్ చేస్తూ సభ్యులంతా మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించారు. అదే రోజు రొద్దం మండలం కేంద్రంలోనూ డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు.
సభ్యురాలికి రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తున్న మొత్తాన్ని సొంత ఖర్చులకు వాడుకోవడానికి వీల్లేదని, పెట్టుబడి నిధిగా వినియోగించాలని అధికారులు సూచించడంతో మహిళలు ఆగ్రహించారు. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్ రమణప్ప, ఏపీఎం భారతి, ఎంపీటీసీ సభ్యుడు నారాయణప్ప, స్థానిక సర్పంచు అశ్వర్థనారాయణ, టీడీపీ మండల కన్వీనర్ చంద్రమోహన్‌లను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిం చారు. తర్వాత రోడ్డుపై బైఠాయిం చారు.
ఈ రెండుచోట్ల మాత్రమే కా దు.. ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో మహిళలు నిరసన గళం విన్పిస్తూనే ఉన్నారు. ‘ఏరు దాటేంత వరకూ ఏటి మల్లన్న... దాటాక బోడి మల్లన్న’ అన్న చందాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 54 వేల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 5.70 లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల సమయానికి వీరిపై రూ. 995 కోట్ల అప్పు నిల్వ ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన వాగ్దానం మేరకు అయితే ఈ రుణాలన్నీ మాఫీ కావాలి. అయితే.. సంఘానికి రూ.లక్ష మాఫీ ప్రకటించడంతో 54 వేల సంఘాలకు రూ. 540 కోట్లు మాఫీ అవుతాయని జిల్లా యంత్రాంగం లెక్కలు తయారుచేసింది.
తాజా నిర్ణయంతో అధికారులే కాకుండా డ్వాక్రా మహిళలు కూడా డైలమాలో పడ్డారు. సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది కూడా సభ్యురాలి ఖాతాలో జమ చేయడం లేదు. సంఘం ఆర్థిక పరిపుష్టికోసం పెట్టుబడి నిధిగా వాడుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, ఏదైనా వ్యాపారం చేసుకోవాలని భావించే వారు సంఘానికి ఇచ్చే రూ. 30 వేలను తీసుకొని తిరిగి కంతుల రూపంలో చెల్లించాలి. దీని వల్ల 54 వేల సంఘాల్లో మొత్తం 5.70 లక్షల మంది సభ్యులుంటే సంఘానికి ఒకరు చొప్పున 54 వేల మంది మాత్రమే లబ్ధి పొందగలరు.
మాఫీ మాయతో మహిళలకు చిక్కులు
చంద్రబాబు చేసిన మాఫీ మాయ వల్ల డ్వాక్రా మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త అప్పు పుట్టక... పాత అప్పులు తీరక సతమతమవుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా రుణాలు మాఫీ చేసి ఉంటే దాదాపు రూ. 995 కోట్లు మహిళలపై భారం తగ్గేది. కనీసం సభ్యురాలికి రూ.10 వేలు మాఫీ చేసినా రూ.570 కోట్లు లబ్ధి చేకూరేది. ప్రస్తుతం రూ.3 వేలు మంజూరు చేస్తున్నా వాడుకోవడానికి వీల్లేదనడంతో మహిళలు లబోదిబోమంటున్నారు. రుణ మాఫీ హామీని నమ్మి మహిళలెవరూ కంతులు కట్టకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వడం కూడా మానేశాయి. గతేడాది రూ.1100 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి రూ. 530 కోట్లు (రెన్యువల్స్‌తో కలుపుకొని) రుణాలిచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి కొత్తగా రుణాలిచ్చింది రూ.100 కోట్లు లోపే.