బైక్‌ అమ్ముతున్నారా.. బీ కేర్‌ ఫుల్‌..! | E Challan For Second hand Sales Bikes | Sakshi
Sakshi News home page

బైక్‌ అమ్ముతున్నారా.. బీ కేర్‌ ఫుల్‌..!

Published Fri, Oct 5 2018 1:12 PM | Last Updated on Fri, Oct 5 2018 1:22 PM

E Challan For Second hand Sales Bikes - Sakshi

మీరు ట్రాఫిక్‌ నిబంధనలన్నీ పాటిస్తున్నా మీ పేరుపై ఈ–చలానాలు ఇంటికి వస్తున్నాయా..? హెల్మెట్‌ ధరించలేదనో.. ట్రిపుల్‌ రైడింగ్‌ చేశారనో.. ఓవర్‌స్పీడ్, సిగ్నల్‌ జంపింగ్‌ వంటివాటికి పాల్పడ్డారనో ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఈ–చలానాలు ఇంటికి పంపిస్తున్నారా..? కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్తే.. మీ పేరుపై ఇప్పటికే ఒక వాహనం ఉందని, రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయాలంటే అదనపు మొత్తం చెల్లించాలని చెబుతున్నారా..? అయితే, వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిందే. మీ పాత వాహనాన్ని విక్రయించిన సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తి అతని పేరుపై వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చుకోకపోవడం, ఆ వాహనం ఇప్పటికీ మీ పేరుతోనే ఉండటమే అందుకు కారణం. దీనిపై ట్రాఫిక్‌ పోలీస్, ఆర్టీఏ అధికారుల కార్యాలయాల్లో సంప్రదించి జాగ్రత్తపడటం ఉత్తమం.

సాక్షి, ఒంగోలు: మార్కెట్లోకి కొత్త వాహనం వస్తే చాలు.. పాత బైక్‌ ఇచ్చేసి కొత్తది కొనుగోలు చేయడం వాహనప్రియులకు పరిపాటి. అయితే ఈ విధానమే నేడు వారికి తిప్పలు తెచ్చిపెడుతోంది. అమ్మిన పాత బైక్‌లు ఇంకా వారి పేరు మీద ఉండటంతో ఇటీవల ఈ చలానాల పరంపర మోత మోగిస్తోంది. తాము విక్రయించిన వాహనం ఎవరి వద్ద ఉందో కూడా తెలియని స్థితిలో ఉన్నవారు కొందరైతే, కొన్నవారు రిజిస్ట్రేషన్‌కు వెనుకాడుతుండటంతో మరికొందరు ఈ చలానాల మోతతో తిప్పలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గత ఎనిమిది నెలల్లోనే దాదాపు 40 లక్షలకుపైగా ఈ చలానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఈ మొత్తంలో కనీసంగా రూ.పది లక్షలకు పైగా మొత్తం పాత వాహనాలకు సంబంధించిన మొత్తమే అని అంచనా.

వాహన విక్రేతలు బెంబేలు
గతంలో వాహనాలను విక్రయించిన వారు నేడు బెంబేలెత్తుతున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ షోరూముల్లో లేదా తెలిసిన వారికి వాహనాలను ఇవ్వడం, వారు మరొకరికి విక్రయించడం జరిగినా మరోమారు రిజిస్ట్రేషన్‌ జరగక పోవడంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అనే విషయమై జిల్లా పోలీసు అధికారులతోపాటు రవాణా శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా వారు స్పెషల్‌ డ్రైవ్, రిజిస్ట్రేషన్‌ రద్దు, ఫిర్యాదు చేయడం తదితర మార్గాలను సూచించారు.   

సమస్యలు ఇలా..
సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుల్లెట్‌ వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్‌ కోసం రవాణాశాఖ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ‘గతంలోనే ఒక వాహనం మీ పేరు మీద ఉంది. కొత్త వాహన రిజిస్ట్రేషన్‌కు రూ.17 వేలు అదనంగా చెల్లించాలి’ అని చెప్పారు. తనకు వాహనమే లేదంటూ సుబ్రహ్మణ్యం అధికారులతో వాదించాడు. తీరా కంప్యూటర్‌లో పరిశీలిస్తే 1986లోనే అతని పేరుపై ఒక బైక్‌ రిజిస్ట్రేషన్‌ అయినట్లు స్పష్టమైంది. దీంతో తాను ఆ బైకును అప్పట్లోనే వేరేవారికి విక్రయించానని, తనవద్ద ఎటువంటి బైక్‌ లేదన్నా అధికారులు మాత్రం ‘నో యూజ్‌.. రూ.17 వేలు కట్టాల్సిందే’ అని స్పష్టం చేయడంతో అడిగినంత చెల్లించి కొత్త బైక్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అయితే పాత వాహనం ఎవరివద్ద ఉందన్నది సుబ్రహ్మణ్యంను నిద్రపట్టనీయకుండా చేస్తోంది.

# రామారావు ఒక వాహనం కొనుగోలు చేశాడు. కొత్త వాహనంపై ఆశపడి పాత వాహనాన్ని తెలిసిన స్నేహితునికి విక్రయించాడు. స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకుని అతనికి సి–బుక్‌తోపాటు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేసి ఇచ్చేశాడు. అయితే రామారావు తాజాగా కొనుగోలు చేసిన బైక్‌ రిజిస్ట్రేషన్‌కు అధిక మొత్తంలో ఫీజు కట్టాలనడంతో పాత బైక్‌ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆ బైక్‌ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మార్చుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించినట్లు స్పష్టమైంది.

# నాలుగేళ్లుగా ఒకే బైకు వాడటం నాగేంద్రం అనే వ్యక్తికి నచ్చలేదు. దీంతో తన పాత బైకును ఒక సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల షాపులో విక్రయించాడు. వారు ఇతను బండి విక్రయించినట్లు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేయించుకున్నారు. కానీ కొన్నది ఎవరనే స్థానంలో ఎవరి పేరూ రాయలేదు. ఆ వాహనాన్ని వేరే వ్యక్తులకు విక్రయించే సమయంలో అక్కడ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రాయాలనేది వారి ఉద్దేశం. ఈ క్రమంలో వారు ఆ వాహనాన్ని అమ్మినప్పటికీ దానిని వారు రికార్డుపరంగా తమ వద్ద ఉంచుకోలేదు. వాహనం కొన్న వ్యక్తి మూడేళ్లు గడిచినా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్‌ మార్చుకోలేదు. ఎలాగూ బండికి రిజిస్ట్రేషన్‌ ఉంది కదా అని దాంతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బండికి సంబంధించి ట్రిపుల్‌ రైడింగ్, హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం, ఓవర్‌స్పీడ్, సిగ్నల్‌ జంపింగ్‌కు సంబంధించి ఆధునిక సాంకేతికత ద్వారా జారీ అయిన చలానాలు పాత యజమానికి చేరుతున్నాయి. ఇదేమని అధికారులను అడిగితే ‘బైక్‌ ఇంకా మీ పేరు మీదే ఉంద’ని సమాధానం ఇచ్చారు.

స్పెషల్‌ డ్రైవ్‌ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తాం
ఈ చలానాల విధానం మొదలైన తర్వాత బైక్‌ రిజిస్ట్రేషన్‌ సమస్య ఎక్కువగా వస్తోంది. వాస్తవానికి వాహన యజమాని తన వాహనాన్ని విక్రయించేటపుడు సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినపుడే అందజేయాలి. కానీ అలా చేయకపోతుండటంతో సమస్య ప్రారంభమైంది. ఈ చలానా పొందిన వారు ఎవరైనా తమ వాహనాన్ని ఫలానా వ్యక్తికి విక్రయించినట్లు స్పష్టంగా తెలిసి ఉంటే, తమకు ఫిర్యాదు చేస్తే చలానాను అతని పేరు మీదకు బదిలీ చేస్తాం. అయితే ఇందుకు కనీసం అతనికి విక్రయించినట్లు ఆధారం తప్పనిసరి. గతంలో వాహనం విక్రయించినప్పటికీ ఆ వాహనం ఏదైనా నేర ఘటనలో చిక్కుకుంటే ఆ కేసు వాహనం ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉంటుందో ఆ వ్యక్తి మీద నమోదవుతుంది.

అయితే ఈ సమస్యకు జిల్లా వ్యాప్తంగా ఈ చలానాలు కావచ్చు లేదా వాహనం విక్రయించినా తమ పేరుమీదే ఇంకా ఉందని భావించేవారు ఎవరైనా తమకు ఫిర్యాదు చేసేలా ఒక స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలనే ఆలోచన ఉంది. సాధ్యపడుతుందనేది పరిశీలిస్తున్నాం. తద్వారా ఇరువర్గాల వారు ముందుకు వస్తే సమస్యలు తొలగిపోతాయి. అలా కాకుండా నేరం చేయాలనే తలంపుతో ఎవరైనా వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉన్నట్లు గనుక తమ దృష్టికి వస్తే వాహనాన్ని నడిపిన వ్యక్తిని కూడా వదిలే ప్రశ్న ఉండదు. ఈ చలానాల వ్యవహారం పక్కనబెట్టి ఎవరైనా తమ పాత వాహనాన్ని గతంలో విక్రయించి ఉంటే వారు ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుని పేరు మారిందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి.
– సత్య యేసుబాబు, ప్రకాశం జిల్లా ఎస్పీ

వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసుకోవడమే బెటర్‌
వాహనానికి సంబందించి ఈ చలానాల బెడద ఆగాలన్నా లేక భవిష్యత్తులో ఆ వాహనం ద్వారా జరిగే ఎటువంటి నేరమైనా తమ మీదకు రాకుండా ఉండాలన్నా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇందుకు వాహనం గతంలోనే తమ వద్ద కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే దానికంటే గతంలోనే వాహనం కొని కాగితాలు అన్నింటిపైనా సంతకం చేసినందువల్ల లీగల్‌గా సమస్యలు రాకుండా ఉండాలంటే ఫలానా నంబర్‌గల వాహనానికి తాను యజమానినని, దానిని తాను ఫలానా సమయంలో ఫలానా వ్యక్తికి లేదా సెకండ్‌ హ్యాండ్‌ షోరూం వారికి విక్రయించినట్లు పేర్కొంటూ పత్రికలో ఒక ప్రకటన ఇవ్వాలి. అందులో వారం రోజుల్లోగా సంబంధిత వాహనం కలిగి ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని లేని పక్షంలో రిజిస్ట్రేషన్‌ను తాను రద్దు చేయించడం జరుగుతుందని పేర్కొనాలి.

ఈ ప్రకటన ఇచ్చిన వారం రోజుల్లో కూడా స్పందించకపోతే సంబంధిత వాహనాన్ని రద్దు చేయాలని కోరుతూ వాహనం ఏ కార్యాలయంలో అయితే రిజిస్ట్రేషన్‌ చేశారో అక్కడికే వెళ్లి రద్దు చేయాలని విజ్ఞప్తి చేయవచ్చు. పత్రికలో ప్రచురితమైన ప్రకటన కాపీ, వాహనం యజమానిని తానే అని నిరూపించేందుకు వీలుగా స్వయంగా రాసిన ఒక పత్రం, బండికి సంబంధించిన నకలు కాపీ(నకలు కాపీ లేని పక్షంలో అడ్వకేట్‌ ధ్రువీకరించిన అఫిడవిట్‌ జత చేయాలి. తద్వారా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. అయితే ఈ ప్రక్రియ జరగాలంటే ఇప్పటి వరకు ఆ వాహనంపై ఉన్న బకాయిలు మొత్తం ముందుగా చెల్లించక తప్పదు.

ఆ తర్వాత తాను ప్రకటన చూడలేదని, అందువల్ల తనకు అన్యాయం జరిగిందంటూ కొనుగోలు చేసిన వ్యక్తి వస్తే.. సంబంధిత వాహన బదిలీ ఫీజు, ఇంతవరకు వాహనాన్ని తన పేరుమీదకు మార్చుకోనందుకు అపరాధ రుసుం రవాణా శాఖకు జమ చేసి వాహనాన్ని అతనిపేరు మీదకు మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే ఇదంతా గతంలో జరిగిన విక్రయానికి సంబంధించింది. ప్రస్తుతం మాత్రం ఎవరైనా తన వాహనాన్ని విక్రయించాలనుకుంటే కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో తమ వేలిముద్ర ద్వారా సంతకం పెట్టడంతోపాటు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అయితే అమ్మిన వ్యక్తి వేలిముద్ర వేసినపుడు ఒక టోకెన్‌ నంబర్‌ వారికి వస్తుంది. ఆ టోకెన్‌ నంబర్‌ ఆధారంగా దానిని కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌కు రావడం లేదంటే పేరు మార్పుకు అతను వచ్చేంత వరకు వాహనం లేదా పత్రాలు కానీ ఇవ్వనని కరాఖండీగా చెప్పాలి.

కొనుగోలు చేసిన వ్యక్తి ఎప్పుడో వేలిముద్ర వేస్తాడని ఎవరైనా చెబితే నమ్మవద్దు. దీనిపై సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేసే షోరూం యాజమాన్యాలకు కూడా ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా వారు వాహనాలను ఎలా కొనుగోలు చేయాలి, ఎలా విక్రయించాలనే దాంతోపాటు వారి వద్ద ప్రస్తుతం ఉన్న స్టాకును కూడా పరిశీలించి సంబంధిత ఫైనాన్స్‌ సంస్థ ఆధీనంలో ఉన్నట్లు రికార్డు చేస్తున్నాం. అంతే కాకుండా ఫైనాన్స్‌ సంస్థలు తాము గతంలో వాహనాలను విక్రయించిన వారికి కూడా అవగాహన కల్పించి వారు కూడా పేరు మార్చుకునేలా ఒత్తిడి తీసుకువస్తున్నాం. వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ.. ప్రస్తుతం అతి తక్కువ అపరాధ రుసుం మాత్రమే ఉన్నందున కొనుగోలుదారులు స్వయంగా ముందుకు వచ్చి తమ పేరు మీదకు మార్చుకుంటే మంచిది.
– సీహెచ్‌వీకే సుబ్బారావు, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement