Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ | second hand bikes double interest in hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ

Published Tue, Jul 30 2024 12:18 PM | Last Updated on Tue, Jul 30 2024 12:18 PM

second hand bikes double interest in hyderabad

     వాయిదాలు ఆలస్యమైతే అధిక చార్జీలు 

    రూ.కోట్లలో గుట్టుగా దందా  దొంగ బైక్‌లకు 

    నకిలీ పత్రాలు సృష్టించి విక్రయం 

    వ్యాపారుల ఉచ్చులో చిక్కుతున్న యువత, చిరుద్యోగులు 

    అధికారుల నియంత్రణ కరువు

పట్టణానికి చెందిన అంకిత్‌ అనే యువకుడు ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాల్సి రావడంతో మోటార్‌ సైకిల్‌ అవసరం పడింది. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లు విక్రయించేవారి వద్ద రూ.60 వేలకు బైక్‌ మాట్లాడుకున్నాడు. మొదట రూ.20 వేలు చెల్లించి బైక్‌ తీసుకున్నాడు. మిగితా డబ్బులు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తానని నిర్వాహకుల వద్దే అధిక వడ్డీకి ఫైనాన్స్‌ చేసుకున్నాడు.

 రెండు నెలలు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలోనే కుటుంబ ఆరి్థక పరిస్థితుల కారణంగా ఫైనాన్స్‌ కట్టలేదు. వెంటనే ఫైనాన్స్‌ వారు వచ్చి బైక్‌ తీసుకెళ్లారు. దీంతో ఉన్న  ఉద్యోగం కూడా పోయింది. ఇది కేవలం అంకిత్‌ పరిస్థితే కాదు. విద్యార్థులు, కారి్మకులు, చిరు వ్యాపారులందరిదీ ఇదే పరిస్థితి. తూప్రాన్‌: ఈజీ ఫైనాన్స్‌ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్‌ వ్యాపారంలో బడా ఆరి్థక నేరం.. బడుగులే టార్గెట్‌.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ ఫైనాన్స్‌ సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

పుట్టగొడుగుల్లా షోరూమ్‌లు
ప్రతీ మండల కేంద్రంలోనూ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ షోరూమ్‌లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి వారికి యువకులు, కాలేజీ స్టూడెంట్లకు ఎటువంటి షరతులు లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌ చెక్కులతో సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్‌ ముచ్చట తీరుతోంది. కానీ బైక్‌ తీసుకున్న తర్వాత అసలు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. బైక్‌ సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్షియర్లు చెప్పిన చోటల్లా సంతకాలు చేస్తున్నారు.  నెల వాయిదా ఆలస్యం అయితే ఈ మొత్తం రోజువారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదాల వసూలుకు ఎన్ని దఫాలు వస్తే చార్జీలు అదనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తెలియదు. వాయిదాలు అన్నీ తీరాక బైక్‌ ఆర్‌సీ బుక్‌ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖరులో చెబుతారు. కొనుగోలు దారులకు బైక్‌పై ఎలాంటి హక్కులు లేకపోవడంతో నోరెత్తకుండా నగదు చెల్లించి బయటపడుతున్నారు. 

దారి తప్పుతున్న విద్యార్థులు 
చాలా మంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరిస్థితి లేకున్నా ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌లో బైక్‌ ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలలపాటు ఫైనాన్స్‌ డబ్బులు కట్టకపోయేసరికి  విద్యార్తుల ఇళ్ల వద్ద ఫైనాన్సి యర్లు గొడవ చేస్తే పరువుపోతుండటంతో పుస్తెలు తాకట్టు పెట్టి  మరీ అప్పులు తీరుస్తున్నారు. అంతే కాకుండా దొంగ బైక్‌లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసుల్లో పట్టుబడినప్పడు ఈ విషయం బహిర్గతమవుతున్న ఘటనలు ఉన్నాయి. సులువుగా అప్పు దొరికేసరికి ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు.

పట్టించుకోని అధికారులు 
ఫైనాన్స్‌ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం.. తీసుకునే వాడి అవసరం అన్నట్లుగా సాగిపోతుంది. సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ అయినప్పటికీ తక్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్‌ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులను అప్పుల ఊబిలో దించే ఈ వ్యాపారంలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

వెనక్కిరాని డబ్బులు 
ఇదిలా ఉంటే మరికొన్ని కేసుల్లో ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్‌ ఇస్తున్నారు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్షియర్‌ మనుషులు స్వా«దీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బులూ వెనక్కి ఇవ్వరు. ఇలా వీరు దోపిడీకి పాల్పడినా అడ్డుకునేందుకు వీలుగా నిబంధనలు లేవు. దొంగిలించిన వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.  అసలు వ్యాపారు లు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా  పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా ఎంపిక చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవలె తూప్రాన్‌లో బైక్‌ జోన్‌లపై పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

చర్యలు తీసుకుంటాం 
సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ల విక్రయాలు పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. సులభ వాయిదాల్లో బైక్‌ కొనాలనుకున్నవారు సెంకడ్‌ హ్యాండ్‌ కొనుగోలు చేస్తున్నారు. బైక్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగా చూసుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అలాగే, వ్యాపారులు ఫైనాన్స్‌ పేరులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 
– రంగాకృష్ణ, సీఐ తూప్రాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement