ఈ-ఆఫీసుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి
కర్నూలు(అగ్రికల్చర్) : ఈ-ఆఫీసుల నిర్వహణపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మొదటి విడతలో 10 ప్రభుత్వ విభాగాల్లో ఈ-ఆఫీసు విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే రెండో విడతలో 32 ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జిల్లా అధికారులతో తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈ-ఆఫీసుల నిర్వహణకు ప్రతిశాఖ జిల్లా అధికారి కార్యాలయంలో ఒక పరిపాలనాధికారిని నియమించాలని తెలిపారు.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, స్థానికంగా పనిచేస్తూ ఎస్టాబ్లిష్‌మెంట్‌పై పట్టుగలిగిన వారిని స్థానిక పరిపాలనాధికారిగా నియమించాలని సూచించారు. రెండో విడతలో వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, వికలాంగుల శాఖ, జిల్లా వృత్తివిద్యా, ఆర్‌ఐఓ, డీఈఓ అగ్నిమాపక దళం, ఉద్యాన శాఖ, హౌసింగ్, ఎన్‌సీఎల్‌పీ, ప్లానింగ్, ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఫారెస్ట్ తదితర వాటిల్లో ఈ- పాలన కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ-విధానం వల్ల పాలన పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని డీపీఓను ఆదేశించారు. జేసీ-2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.