సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎయిర్‌పోర్ట్‌లో పరీక్ష!
న్యూయార్క్: సాఫ్ట్ ఉద్యోగులూ.. బీ అలర్ట్. మంచి మార్కులతో చదువు పూర్తి చేసుకొని.. సంస్థలు నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఎలాగోలా ఉద్యోగాలు సంపాదించినా.. ఇక అక్కడితోనే ప్రిపరేషన్ ఆపేస్తే సరిపోదు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా మరోసారి మిమ్మల్ని పరీక్షించే అవకాశం లేకపోలేదు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇటీవల ఓ నైజీరియన్‌కు పరీక్ష పెట్టారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగగానే.. 'ఇంతకూ నువ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌వేనా' అని అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఓ పెన్నూ పేపర్ ఇచ్చి ప్రూవ్ చేసుకోమన్నారు. బైనరీ సెర్చ్ ట్రీ, అబ్‌స్ట్రాక్ట్ క్లాస్కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. ఊహించని పరీక్షకు సెలెస్టిన్ ఒమిన్ అనే 28 ఏళ్ల ఇంజనీర్ షాక్ తిన్నాడు. న్యూయార్క్, లాగోస్, నైరోబీలలో కార్యాలయాలు ఉన్న అండెలా అనే ఓ టెక్ స్టార్టప్ కంపెనీలో సెలెస్టిన్ పనిచేస్తున్నాడు.
తీరా ప్రశ్నలకు ఎలాగోలా జవాబులు రాసినా అధికారులు సంతృప్తి చేందలేదని సెలెస్టిన్ వాపోయాడు. తనను తిరిగి నైజీరియాకు పంపిస్తారని భావిస్తున్న తరుణంలో అధికారులు అనూహ్యంగా అనుమతించారని సెలెస్టిన్ వెల్లడించాడు. ఇక్కడో విషయం గమనించాలి.. డొనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన ఏడు ముస్లిం దేశాల జాబితాలో నైజీరియా లేదు.