రాజధాని చెరి సగం కావాలి
విజయవాడను విస్మరిస్తే జనం క్షమించరు
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ
విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత విజయవాడను రాజధానిగా ప్రకటించి న సీఎం చంద్రబాబు ఇప్పుడు గుంటూరు పాట పాడటం వెనుక కోటరీ ప్రభావం ఉందన్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రైతాంగం సిద్ధంగా ఉందన్నారు. నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయన్నారు. తుళ్లూరు, వెంకటాయపాలెం ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదన్నారు. కృష్ణాజిల్లాను కలుపుకొని రాజధాని ఏర్పాటు చేయాలన్నదే తన డిమాండ్‌గా పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాను విస్మరిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించరన్నారు. గతంలోనే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాను కాబట్టి.. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం లేదనుకునే ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తే తెలుగుజాతి క్షమించదన్నారు.
రాజధాని నిర్మాణానికి సుజనా చౌదరి, జీఎంఆర్ అల్లుడి వంటి కార్పొరేట్ శక్తులతో కాకుండా సాంకేతిక నిపుణులతో కమిటీ వేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కృష్ణాజిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని నెహ్రూ చెప్పారు. కోట్లు గుమ్మరించి గుంటూరు జిల్లాలో భూములు కొనాలనుకోవడం వెనుక బాబు కోటరీ చక్రం తిప్పుతోందన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. ఇంత జరుగుతున్నా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చెప్పే ప్రతి మాటకు తలలు ఊపడం మాని విజ్ఞతతో ఆలోచించాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు దమ్ముంటే న్యాయవిచారణ జరిపించాలన్నారు. తప్పు చేసినట్లు రుజువైతే జైలుకెళ్లడానికి తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబులా బెయిల్ తెచ్చుకోబోమని దేవినేని నెహ్రూ ఎద్దేవా చేశారు.