మూడోరోజూ జరగని ఎంసెట్ కౌన్సెలింగ్
Published Thu, Aug 22 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
జేఎన్‌టీయూ (విజయనగరం రూరల్), న్యూస్‌లైన్: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సె లింగ్ మూడోరోజూ నిలిచి పోవడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు నిరాశగా వెను దిరిగారు. విజయనగరంలోని మహా రాజా ఆనంద గజపతి ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో ఈ నెల19 నుంచి నిర్వ హించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర సమ్మెతో రెండురోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎలాగైనా మూడోరోజు బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జరపాలని ప్రభుత్వం భావించి స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నిర్వహించాలని జేఎన్‌టీయూ కళాశాలకు సమాచారం అందజేసి, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్‌ను నిర్వి హంచడానికి అధి కారులు ఏర్పాట్లు చేశారు. కౌన్సెలింగ్ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు సుమారు ఐదు వందల మంది, వారి తల్లిదండ్రులు కళాశాలకు ఉదయం తొమ్మిది గంటలకే చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి ఉద్యమకారులు ఎవరూ కళాశాలలోకి ప్రవేశించకుండా పోలీసులు క్యాంపస్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కౌన్సెలింగ్‌కు అంతా సిద్ధం చేసి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకునే సమయంలో ఎన్జీవో జేఏసీ ప్రతినిధులు జేఎన్‌టీయూ జేఏసీ సభ్యులతో చర్చలు జరిపారు. దీంతో జేఎన్‌టీయూ కళాశాల సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా రెండు రోజులపాటు సామూహిక సెలవు పాటిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉదయ్‌భాస్కర్‌కు నోటీసు అందజేయడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
కళాశాలలోకి సమైక్యాంధ్ర ఎన్జీఓ జేఏసీ సభ్యులు ప్రవేశించారన్న విషయాన్ని తెలుసుకుని ఎస్పీ కార్తికేయ, డీఎస్పీ కృష్ణప్రసన్న అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ కృష్ణప్రసన్న ప్రిన్సిపాల్‌తో చర్చలు జరిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటించాలని ప్రిన్సిపాల్‌కు, పోలీసులకు తెలియ జేశారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఈ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంసెట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయించాలని, లేని పక్షంలో వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలుచేస్తూ అక్కడ నుంచి వెనుదిరిగారు.
Advertisement