విద్యుత్ శాఖలో పోస్టులు ఖాళీ! | East distribution of electricity posts | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖలో పోస్టులు ఖాళీ!

Published Fri, Jul 15 2016 12:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

East distribution of electricity posts

శ్రీకాకుళం టౌన్:  తూర్పుపంపిణీ విద్యుత్ సంస్థ ద్వారా జిల్లాకు కరెంటు సరఫరా జరుగుతోంది. శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లుగా విభజించి సేవలందిస్తున్నారు. 11 సముద్రతీర ప్రాంత మండలాలు, 17 ఏజెన్సీ మండలాలు, 10 మైదాన ప్రాంతాలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తరచూ తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. చిన్న అంతరాయం ఏర్పడినా పల్లెలు చీకట్లో ఉండిపోవాల్సిందే.
 
  దీనికి కారణం క్షేత్రస్థాయిలో పని చేయూల్సిన జూనియర్, అసిస్టెంట్ లైన్‌మెన్లు లేకపోవడమే. ఈపీడీసీఎల్ పరిధిలో జిల్లాకు విద్యుత్ సరఫరా అవుతున్న ప్రధాన 220 ఉపకేంద్రాలైన టెక్కలి, గరివిడిలతోపాటు 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలైన చిలకపాలెం, పాలకొండ,పైడిభీమవరం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, నరసన్నపేట, మరో 33/11 ఉపకేంద్రా లు 86 పనిచేస్తున్నాయి. వీటిని42 ప్రాంతాలను కలుపుతూ ఉన్న 33 కేవీ ఫీడరు లైన్లు, 312 ప్రాంతాలను కలుపుతూ 11 కేవీ ఫీఢర్ లైన్లకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి.
 
  వీటి పరిధిలో 5.32 లక్షల మంది గృహ వినియోగదారులు, 22,378 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమలకు కేటాయించే విద్యుత్ లైన్లు నిర్వహణ సాగుతోంది. రణస్థలం మండలం పైడిభీమవరం, రాజాం, పలాస-కాశీబుగ్గ ప్రాంతాల్లో ఉన్న భారీ, మధ్యతరహా పరిశ్రమలు,గ్రామీణ, కుటీర పరిశ్రమలకు విద్యుత్ సరఫరా సరఫరా అవుతోంది. జిల్లాలో 37 భారీ పరిశ్రమల్లో రెండింటికి మినహా మిగిలిన వాటికి సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు లే వు. వాటికి విద్యుత్ శాఖ నుంచే సరఫరా అంది స్తున్నారు.
 
  మధ్య, చిన్న తరహా పరిశ్రమలు 6,275 వరకు ఉన్నాయి. వీటికి తోడు అత్యవసర సేవలైన ఆస్పత్రులు, తాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ వినియోగదారుల్లో ఏఒక్కరికి విద్యుత్ సరఫరా నిలిచి పోయినా ఇబ్బందిగా మారింది. వ్యాపార వర్గాలకు మరింత నష్టం తప్పదు. ఇంత ప్రాధాన్యత ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయ నిర్వహణ, పదోన్నతులో కూర్చున్న సీట్లకు ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయి ఉద్యోగాలను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
  సర్వీసుల ఆధారంగా గతంలో జూనియర్ లైన్‌మెన్లు, అసిస్టెంటు లైన్‌మెన్ల నియామకం జరిగేది. కాని గత కొంత కాలంగా విద్యుత్ శాఖలో క్షేత్రస్థా యి నియామకాలు జరగడం లేదు. ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చి కూర్చునే సీట్లకు మారుస్తున్న ఈ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నియామకాలను పక్కనపెట్టి వినియోగదారులకు ఇబ్బందుల పాల్జేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
  జిల్లా వ్యాప్తంగా 134 ఏఎల్‌ఎం, జేఎల్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిస్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టకుండా పదోన్నతులు ఇవ్వడంతో మరికొన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. రానున్న రెండేళ్లలో ఈ పోస్టు ల భర్తీ జరగక పోతే జిల్లాలో జూనియర్, అసిస్టెంట్ లైన్‌మెన్లు ఒక్కరూ ఉండరని, స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టాలంటే వినియోగదారులే ఆ పనికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పదని ఉద్యోగులే చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement