సాక్షి, కిర్లంపూడి : పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. ఛలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని.. అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు.
ఛలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఇందులో భాగంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజుల నుండి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment