‘ఈ-సెట్’లో ‘ఈస్ట్’ మెరుపులు | ecet results are released | Sakshi
Sakshi News home page

‘ఈ-సెట్’లో ‘ఈస్ట్’ మెరుపులు

Published Tue, May 20 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

ecet results are released

 జేఎన్‌టీయూకే నిర్వహించిన ఈ-సెట్-2014లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ప్రకాశించింది. 13 బ్రాంచ్‌లలో ఈ పరీక్ష నిర్వహించగా సీహెచ్‌ఈలో ఆత్రేయపురం మండలం వద్దిపర్రు కు చెందిన పి.సత్యసాయిరామ్ మొదటి ర్యాంకు సాధించాడు. ఈఈఈలో అమలాపురానికి చెందిన బి.కరుణప్రియ, ఎంఈటీ లో యు.కొత్తపల్లికి చెందిన వీఎన్ కొండలరావు రెండో ర్యాం కును సొంతం చేసుకున్నారు. వీరిలో కొండలరావు తీరికవేళల్లో పొలం పనుల్లో కష్టించి చెమటోడుస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మరికొందరు జిల్లా విద్యార్థులూ వివిధ విభాగాల్లో మంచి ర్యాంకులు సాధించారు. ఈ-సెట్ ఉత్తీర్ణులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంది.                    
 
 ప్రణాళికా బద్ధమైన చదువు జీవితాన్ని ఉన్నత శిఖరాలపై నిలబెడుతుంది. అలా ఉన్నతస్థాయికి ఎదగాలనే తపన నేడు పలువురు విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఎలా ఉన్నా, పేదరికం వేధిస్తున్నా వారి సంకల్పాన్ని అవేవీ అడ్డుకోజాలకున్నాయి. ఇందుకు తాజాగా వెల్లడైన ఈసెట్ ఫలితాలే ప్రత్యక్ష తార్కాణాలు. అమలాపురంలో ఒక కానిస్టేబుల్ కుమార్తె రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. సామర్లకోటలో చిరువర్తకుల బిడ్డ ఆరో ర్యాంక్ పొందాడు. కొత్తపల్లి మండలం యండపల్లిలో కూలీ కుటుంబం నుంచి  ఎగసిన కాంతిరేఖలుగా ఇద్దరు ర్యాంకర్లు మెరిశారు. ఈసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు భావి జీవితా శయాలను, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించు కోవడం అభినందనీయం
 
 ఐఏఎస్ కావడమే లక్ష్యం
 
 రెండో ర్యాంక్ సాధించిన కరుణ ప్రియ
 
 అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : అమలాపురం రామకృష్ణానగర్‌కు చెందిన బూర కరుణ ప్రియ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నానని చెప్పింది. ప్రణాళిక ప్రకారం చదవడం, తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధ్యమైందని చెప్పింది. జేఎన్‌టీయూకేలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆ తరువాత ఐఏఎస్‌పై దృష్టిపెడతానంది. విజయవాడ న్యూ స్టూడెంట్ అకాడమీలో ఈసెట్‌లో శిక్షణ పొందిన కరుణ ఆ పరీక్షల్లో విజేతగా నిలిచింది. కరుణ తండ్రి రమణి శంకరరావు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

పెద్ద కుమార్తె 2012 ఎంసెట్ మెడిసన్‌లో ర్యాంకు సాధించి అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. కరుణ రెండో కుమార్తె. ఆమె గొల్లప్రోలులో టెన్‌‌త, కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చదివింది. తమ కుమార్తె రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన విషయం తెలియగానే శంకరరావు కుటుంబ సభ్యులు విజయవాడ కోచింగ్ సెంటర్‌లో ఉన్న కరుణతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తల్లి సత్యవతి, అక్క రత్నమాధురి, చెల్లి, తమ్ముడు కరుణను ఫోన్‌లో అభినందించారు. అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, తాలూకా ఎస్సై కె.సుధాకర్ కూడా అభినందించారు. పిల్లల చదువుపై తాను శ్రద్ధ వహించానని, మొదటి కుమార్తె డాక్టర్ అవుతుంటే, రెండో అమ్మాయి ఇలా ఉన్నత ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని శంకరరావు అన్నారు.
 
 ‘కోట’ విద్యార్థికి ఆరో ర్యాంక్

 మంచి ఇంజనీర్ అవుతానంటున్న ఆనందరావు

సామర్లకోట, న్యూస్‌లైన్ :సామర్లకోట సాయినగర్‌కు చెందిన చిరువ్యాపారుల బిడ్డ గానుగుల ఆనందరావు ఈసెట్‌లో ఆరో ర్యాంక్ సాధించాడు. సాయినగర్‌కు చెందిన గానుగుల అన్నవరం, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు గణేష్ ఇంటర్, రెండో కుమారుడు సురేష్ 10వ తరగతి మాత్రమే చదివారు. మూడోవాడ్ని బాగా చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.పెద్దాపురం మహరాణి కళాశాలలో బీఎస్సీ చదివి, ఐడియల్ కళాశాలలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆనందరావు కాకినాడ నాగార్జున ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇంజనీర్ కావాలనే పట్టుదలతో ఈసెట్ రాసి 6వ ర్యాంకు సాధించానని ఆనందరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పారిశ్రామిక అనుబంధ టెస్టులు రాసి మంచి ఇంజనీర్ అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహమే తన విజయానికి దోహదపడిందన్నారు. ఆయన తండ్రి పువ్వుల వ్యాపారం, తల్లి కిరాణా కొట్టు నిర్వహిస్తున్నారు. వారు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తమ బిడ్డ ఏమి చదువుతున్నాడో తెలియదని, అయితే మంచి ర్యాంక్ వచ్చిందని తెలిసి సంతోషిస్తున్నామని అన్నారు. తమ కుమారుడు ఎంత చదువుతానని చెప్పినా తాము చదివిస్తామని ఆ దంపతులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement