సాక్షి, అనకాపల్లి టౌన్ (విశాఖ జిల్లా): నిమజ్జనం అంటే అదో ఉత్సాహం. ఊరేగింపులో తీన్‌మార్ డప్పుల దరువులు ఓ వైపు.. జై.. చిందెయ్ అంటూ నృత్యాలు చేసే యువత మరో వైపు.. ఇప్పటి వరకూ మనం ఇలాంటి సన్నివేశాల్నే చూశాం. గంగ దరికి గణపయ్యను చేర్చే ట్రెండ్‌కి ఈ యువకులు ఫుల్‌స్టాప్ పెట్టారు. గంగను గణపయ్య దరికి చేర్చే ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగం.. జలవనరులు కలుషితమవ్వడం.. ఊరేగింపు కోసం ఇంధనం ఖర్చు.. ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాలు ఆ యువకుల్ని ఆలోచింపజేశాయి. అందుకే ఈ ఏడాది గణపయ్య పండుగను పూర్తి పర్యావరణహితంగా చేయాలని నిర్ణయించుకున్నారు గవరపాలెం సత్తెమ్మతల్లి యూత్ క్లబ్ సభ్యులు. 25 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 2 ట్రాక్టర్ల మట్టిని వినియోగించారు. పి.శ్యామ్ అనే శిల్పి 30 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. నిమజ్జనాన్ని కూడా మండపంలోనే చేయాలని సంక్పలించారు.
ఈ నెల 21న దీనికి ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయనున్నారు. నిమజ్జనం కోసం 5000 లీటర్ల నీటిని వినియోగిస్తారు. చివరి రోజు పార్వతీపుత్రుడ్ని 20 నుంచి 30 లీటర్ల పాలతో అభిషేకించనున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న మృణ్మయనాథుడ్ని చూసేందుకు అనకాపల్లితో పాటు పరిసర ప్రాంతాల వాసులు మక్కువ చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment