సాక్షి, పాయకరావుపేట: అనకాపల్లిలోని రాజయ్యపేట వద్ద ఉత్కంఠ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతులెత్తేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం మా పరిధిలో లేదని చెప్పేశారు. దీంతో, మత్స్యకారులు.. కలెక్టర్, కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 1000 కోట్ల ప్రాజెక్టు కోసం 50,000 మందిని చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
రాజయ్యపేటలో కలెక్టర్ అధ్యక్షతన ఈరోజు గ్రామసభ జరిగింది. గ్రామసభకు రాజయ్యపేట గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్‌ను ఆపాలి. బల్క్ డ్రగ్ పార్క్‌ను అంగీకరించం. 41 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నాం. సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం. మాకు సముద్రాన్ని దూరం చేయొద్దు. బల్క్ డ్రగ్ పార్క్ వలన సముద్రంలో చేపలు చనిపోతాయి. ప్రజలు రోగాలతో చనిపోతారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలి’ అని డిమాండ్ చేశారు. గ్రామస్తులు నిరసనలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
గ్రామసభ అనంతరం, బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతులెత్తేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం మా పరిధిలో లేదని చెప్పేశారు. మత్య్సకారుల అభిప్రాయాల అన్నింటిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతాము. అభిప్రాయాలు అన్నిటిని వీడియో రూపంలో, పేపర్ మీద నోట్ చేసుకున్నాము.. గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు జరగలేదు. రోడ్లు పనులు మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కలెక్టర్ ప్రకటనపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. కలెక్టర్ బల్క్ డ్రగ్ పార్క్ కంపెనీ కాదంటున్నారు. పార్కు అంటే కేబీఆర్, లుంబిని పార్క్ కాదు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మాకు వద్దు.. ప్రజాభిప్రాయంలో అనుకూలంగా చెప్పింది టీడీపీ నేతలే. రాజయ్యపేట ప్రజలందరూ బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకించారు. యనమల రామకృష్ణ బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తే, రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ ప్రజలే మనుషులా, మేము మనుషులం కాదా?. శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. 1000 కోట్ల ప్రాజెక్టు కోసం 50,000 మందిని చంపేస్తారా? అని ప్రశ్నించారు.


