సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్‌సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ..
‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్‌తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి..
.. పరిశ్రమలకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు.
త్వరలో జగన్ రాక..
‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్‌ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు.

పోలీసుల ఓవరాక్షన్‌పై..
రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు.


