విద్యాశాఖ.. గాడిన పడేనా.. | Education deparment spoiled by inchagres rule | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ.. గాడిన పడేనా..

Published Mon, Feb 2 2015 10:47 AM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM

Education deparment spoiled by inchagres rule

ఇన్‌చార్జుల పాలనలో విద్యాశాఖ
 పది మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు
 డీఈవో త్రిపాత్రాభినయం
 నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్‌చార్జులే

 
 ఒంగోలు వన్‌టౌన్: జిల్లా విద్యాశాఖ ఇన్‌చార్జుల పాలనలో కుంటుపడుతోంది. కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పరిపాలన గాడి తప్పుతోంది. పర్యవేక్షణాధికారుల కొరతతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అడుగంటుతున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలలు దశాబ్దకాలంగా వార్షిక తనిఖీలకు నోచుకోలేదంటే జిల్లాలో విద్యాశాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
 
 దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారాయి.  జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. కొన్నేళ్లుగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఉపవిద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 56 మండలాలకుగాను కేవలం పది మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలుండగా మిగతా 46 మండలాలకు ఇన్‌చార్జులే దిక్కయ్యారు. వివిధ స్థాయిల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాఠశాలల ఆకస్మిక సందర్శనలు, వార్షిక తనిఖీలు మందగించాయి. ఫలితంగా పాఠశాలల పనితీరు దిగజారింది. ఒంగోలులో విద్యాప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో మెరుగవడం లేదు.
 
 డీఈవో త్రిపాత్రాభినయం:
 జిల్లా విద్యాశాఖలో కీలకమైన డీఈవో పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీఈవోగా పనిచేస్తున్న రాజేశ్వరరావు గతేడాది మేలో ఇక్కడ నుంచి బదిలీపై తెలంగాణకు వెళ్లారు. అప్పటి నుంచి డీఈవో పోస్టు ఖాళీగానే ఉంది. పర్చూరు ఉపవిద్యాధికారిగా పనిచేస్తున్న బి.విజయభాస్కర్ జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణా సంస్థ ప్రిన్సిపల్‌గా కూడా విజయభాస్కర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఒకే అధికారి మూడు పోస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. డీఈవోలు మండల విద్యావనరుల కేంద్రాలను (ఎంఈఓ) ఆకస్మికంగా సందర్శించటంతో పాటు వార్షిక తనిఖీలను కూడా నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారిగా, ఉపవిద్యాధికారిగా తన డివిజన్ పరిధిలోని పాఠశాలలతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలను కూడా సందర్శించాల్సి ఉంది.
 
 నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్‌చార్జులే..
 జిల్లాలో ఐదు ఉపవిద్యాధికారుల పోస్టులుండగా నాలుగు పోస్టులకు ఇన్‌చార్జులే దిక్కయ్యారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, పర్చూరు విద్యాడివిజన్లతో పాటు జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారి పోస్టు కూడా ఉంది. ఈ ఐదింటిలో పర్చూరు డివిజన్‌కు మాత్రమే బి.విజయభాస్కర్ రెగ్యులర్ ఉపవిద్యాధికారిగా కొనసాగుతుండగా, మిగిలిన నలుగురు ఇన్‌చార్జులే. జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారికిగా ఇనమనమెళ్లూరు జెడ్పీ హైస్కూలు హెచ్‌ఎం కె.వెంకట్రావు, ఒంగోలు ఉపవిద్యాధికారిగా ఒంగోలు మండల విద్యాధికారి ఇ.సాల్మన్, కందుకూరు ఉపవిద్యాధికారిగా ఎస్‌కె చాంద్‌బేగం, మార్కాపురం ఉపవిద్యాధికారిగా కాశీశ్వరరావు పని చేస్తున్నారు.
 
 పది మండలాలకే  రెగ్యులర్ ఎంఈవోలు:
 జిల్లాలోని 56 మండలాల్లో కేవలం పది మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. కొన్నేళ్లుగా 46 మండలాల్లోని మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, మద్దిపాడు, సింగరాయకొండ, జె.పంగులూరు, మార్టూరు, ముండ్లమూరు, మార్కాపురం, గిద్దలూరు, వేటపాలెం, అద్దంకి మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు.  
 
 ఇన్‌స్పెక్షన్లు, విజిట్లు తూచ్:
 జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు అధికారుల విజిట్లు, ఇన్‌స్పెక్షన్లు నామమాత్రమయ్యాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులు తప్పనిసరిగా ప్రతినెలలో ఐదు పాఠశాలలకు వార్షిక తనిఖీలు నిర్వహించాలి. 10 నుంచి 15 పాఠశాలల నుంచి ఆకస్మికంగా సందర్శించి పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలలకు పదేళ్లుగా వార్షిక తనిఖీల్లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో పాఠశాల వార్షిక తనిఖీ అంటే నెల ముందు నుంచే హడావుడి చేస్తూ పిల్లలను తనిఖీలకు సిద్ధం చేసేవారు. అయితే ప్రస్తుత తనిఖీలు తూతూమంత్రంగా మారాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలయితే ఉపాధ్యాయులిచ్చిన తృణమో, పణమో తీసుకొని తనిఖీలను మమ అనిపిస్తున్నారు.
 
 సమావేశాలతోనే సరి..
 ప్రభుత్వ నిర్వాకం కూడా అధికారుల పనితీరును దెబ్బతీస్తోంది. మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులకు నెలలో కనీసం 10, 15 సమావేశాలు నిర్వహిస్తూ చిటికీమాటికి జిల్లా కేంద్రానికి పిలిపిస్తూ వారి సమయాన్ని అంతా హరించివేస్తున్నారు. పాఠశాలల సందర్శనలు, తనిఖీలకు తమ సమయాన్ని వెచ్చించి విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిన అధికారుల సమ యం అంతా సమావేశాలకు హాజరుకావడంతోనే సరిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ లో ప్రయోగాలకు స్వస్తి చెప్పి క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణాధికారుల పోస్టులన్నింటినీ భర్తీ చేసి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని విద్యాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement