Incharges rule
-
Karimnagar: పనిభారంతో పరిపాలన అస్తవ్యస్తం
‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని, ప్రజాసమస్యలు వెనువెంటనే పరిష్కారమవుతాయని, ఎలాంటి అర్జీలకైన సత్వరమే స్పందించి జవాబుదారీతనం పాటించేలా పాలన ఉంటుందని చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. జిల్లాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కీలకమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రజలు తమ అర్జీలతో జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి వెల్లువలా రావడం, పోవడం వంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎవరిని కదలించినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి’. కరీంనగర్: జిల్లాలో ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. వివిధ శాఖలకు పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. మరోవైపు ఒక్కో అధికారికి అదనంగా మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పనిచేసే వారికి ఇతర జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. సంబంధిత అధికారి ఏ వారం ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా డెప్యూటేషన్లపై ఒకేచోట.. జిల్లాల పునర్విభజన తర్వాత కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించకపోవడంతో డెప్యూటేషన్లపై ఏళ్లుగా ఒకేచోట కొనసాగుతున్నారు. 15 మంది వరకు జిల్లా విద్యాశాఖ, ఎంఈవో కార్యాలయాల్లో, కొందరు ఉపాధ్యాయులు అనధికారికంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. రెవెన్యూ, వైద్యశాఖల్లో 20 నుంచి 30 మంది ఇలాగే ఉన్నారు. వైద్యశాలల్లో సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. ఇన్చార్జీల చేతుల్లో కీలక శాఖలు ► జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఆర్వో పోస్టులో రెండేళ్లుగా అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ► జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. రెండు ఉప విద్యాధికారి పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ► జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా ఇన్చార్జి అధికారిగానే వ్యవహరిస్తున్నారు. ► కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలందిస్తున్న కరీంనగర్ ప్రధానాస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టు కొన్నేళ్లు ఖాళీగా ఉంది. దీంతో అదేశాఖలో పనిచేస్తున్న రత్నమాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ► మెడికల్ షాపులను పర్యవేక్షించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► గనులు, భూగర్భ గనుల శాఖకు సంబంధించి ఏడీగా వ్యవహరిస్తున్న సత్యనారాయణకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇదే శాఖలో అసిస్టెంట్ జువాలజీ(ఏజీ)గా ఉన్న రవిబాబు కరీంనగర్, ములుగు జిల్లాల ఇన్చార్జిగా ఉన్నారు. ► తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు ఎనిమిదేళ్లుగా ఇన్చార్జి అధికారిగానే పనిచేస్తున్నారు. ► మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కొన్ని నెలలు సెలవులో వెళ్లడంతో అదే శాఖలో పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ► కరీంనగర్ అగ్రికల్చర్ ఏడీ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ► కార్మిక శాఖ అధికారి రమేశ్‌బాబు గత 3 నెలలుగా సెలవులో ఉండటంతో సంగారెడ్డి జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ► జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తార్యనాయక్ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో మరో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిగా సబితకుమారి పని చేస్తున్నారు. ► ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు గంగారాం, మధుసూదన్‌లకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పరిపాలన వ్యవహారాలు చూడాల్సి రావడం, అదనపు బాధ్యతలతో ఆ శాఖలపై పూర్తి పట్టు సాధించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. -
విద్యాశాఖ.. గాడిన పడేనా..
ఇన్చార్జుల పాలనలో విద్యాశాఖ పది మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు డీఈవో త్రిపాత్రాభినయం నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్చార్జులే ఒంగోలు వన్‌టౌన్: జిల్లా విద్యాశాఖ ఇన్చార్జుల పాలనలో కుంటుపడుతోంది. కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పరిపాలన గాడి తప్పుతోంది. పర్యవేక్షణాధికారుల కొరతతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అడుగంటుతున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలలు దశాబ్దకాలంగా వార్షిక తనిఖీలకు నోచుకోలేదంటే జిల్లాలో విద్యాశాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారాయి. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. కొన్నేళ్లుగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఉపవిద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 56 మండలాలకుగాను కేవలం పది మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలుండగా మిగతా 46 మండలాలకు ఇన్చార్జులే దిక్కయ్యారు. వివిధ స్థాయిల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాఠశాలల ఆకస్మిక సందర్శనలు, వార్షిక తనిఖీలు మందగించాయి. ఫలితంగా పాఠశాలల పనితీరు దిగజారింది. ఒంగోలులో విద్యాప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో మెరుగవడం లేదు. డీఈవో త్రిపాత్రాభినయం: జిల్లా విద్యాశాఖలో కీలకమైన డీఈవో పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీఈవోగా పనిచేస్తున్న రాజేశ్వరరావు గతేడాది మేలో ఇక్కడ నుంచి బదిలీపై తెలంగాణకు వెళ్లారు. అప్పటి నుంచి డీఈవో పోస్టు ఖాళీగానే ఉంది. పర్చూరు ఉపవిద్యాధికారిగా పనిచేస్తున్న బి.విజయభాస్కర్ జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణా సంస్థ ప్రిన్సిపల్‌గా కూడా విజయభాస్కర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే అధికారి మూడు పోస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. డీఈవోలు మండల విద్యావనరుల కేంద్రాలను (ఎంఈఓ) ఆకస్మికంగా సందర్శించటంతో పాటు వార్షిక తనిఖీలను కూడా నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారిగా, ఉపవిద్యాధికారిగా తన డివిజన్ పరిధిలోని పాఠశాలలతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలను కూడా సందర్శించాల్సి ఉంది. నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్చార్జులే.. జిల్లాలో ఐదు ఉపవిద్యాధికారుల పోస్టులుండగా నాలుగు పోస్టులకు ఇన్చార్జులే దిక్కయ్యారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, పర్చూరు విద్యాడివిజన్లతో పాటు జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారి పోస్టు కూడా ఉంది. ఈ ఐదింటిలో పర్చూరు డివిజన్‌కు మాత్రమే బి.విజయభాస్కర్ రెగ్యులర్ ఉపవిద్యాధికారిగా కొనసాగుతుండగా, మిగిలిన నలుగురు ఇన్చార్జులే. జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారికిగా ఇనమనమెళ్లూరు జెడ్పీ హైస్కూలు హెచ్ఎం కె.వెంకట్రావు, ఒంగోలు ఉపవిద్యాధికారిగా ఒంగోలు మండల విద్యాధికారి ఇ.సాల్మన్, కందుకూరు ఉపవిద్యాధికారిగా ఎస్కె చాంద్‌బేగం, మార్కాపురం ఉపవిద్యాధికారిగా కాశీశ్వరరావు పని చేస్తున్నారు. పది మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు: జిల్లాలోని 56 మండలాల్లో కేవలం పది మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. కొన్నేళ్లుగా 46 మండలాల్లోని మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, మద్దిపాడు, సింగరాయకొండ, జె.పంగులూరు, మార్టూరు, ముండ్లమూరు, మార్కాపురం, గిద్దలూరు, వేటపాలెం, అద్దంకి మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. ఇన్స్పెక్షన్లు, విజిట్లు తూచ్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు అధికారుల విజిట్లు, ఇన్స్పెక్షన్లు నామమాత్రమయ్యాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులు తప్పనిసరిగా ప్రతినెలలో ఐదు పాఠశాలలకు వార్షిక తనిఖీలు నిర్వహించాలి. 10 నుంచి 15 పాఠశాలల నుంచి ఆకస్మికంగా సందర్శించి పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలలకు పదేళ్లుగా వార్షిక తనిఖీల్లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో పాఠశాల వార్షిక తనిఖీ అంటే నెల ముందు నుంచే హడావుడి చేస్తూ పిల్లలను తనిఖీలకు సిద్ధం చేసేవారు. అయితే ప్రస్తుత తనిఖీలు తూతూమంత్రంగా మారాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలయితే ఉపాధ్యాయులిచ్చిన తృణమో, పణమో తీసుకొని తనిఖీలను మమ అనిపిస్తున్నారు. సమావేశాలతోనే సరి.. ప్రభుత్వ నిర్వాకం కూడా అధికారుల పనితీరును దెబ్బతీస్తోంది. మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులకు నెలలో కనీసం 10, 15 సమావేశాలు నిర్వహిస్తూ చిటికీమాటికి జిల్లా కేంద్రానికి పిలిపిస్తూ వారి సమయాన్ని అంతా హరించివేస్తున్నారు. పాఠశాలల సందర్శనలు, తనిఖీలకు తమ సమయాన్ని వెచ్చించి విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిన అధికారుల సమ యం అంతా సమావేశాలకు హాజరుకావడంతోనే సరిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ లో ప్రయోగాలకు స్వస్తి చెప్పి క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణాధికారుల పోస్టులన్నింటినీ భర్తీ చేసి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని విద్యాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇన్‌చార్జిలే దిక్కు
కనిగిరి: విద్యాశాఖలో మండల స్థాయిలో ఎంఈవోలదే కీలకపాత్ర. అయితే వారి స్థానంలో అత్యధికంగా ఇన్చార్జుల పాలనే సాగుతోంది. దీంతో అనేక చోట్ల విద్యాప్రగతికి విఘాతం కలుగుతోంది. జిల్లాలోని 56 మండలాల్లో పది మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేసే ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు న్యాయం చేయలేకపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలకు సంబంధించిన అనేక నివేదికలు తయారు చేయడంలో ఇన్చార్జ్ ఎంఈవోలు నిమగ్నమవుతారు. ప్రతినెలా పాఠశాలల మౌలిక వసతులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటు, శిక్షణ తరగతులు తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు హెచ్ఎంలుగా విధులు నిర్వహించే పాఠశాలలకు వారానికి మూడు రోజులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొంత పాఠశాలలోని విద్యార్థులకు న్యాయం చేయలేక పనిభారంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కందుకూరు డివిజన్లో పరిస్థితి దయనీయం... జిల్లాలో 56 మండలాలకు సంబంధించి ఉలవపాడు, అద్దంకి, కొరిశపాడు, సంతనూతలపాడు, జె పంగులూరు, దోర్నాల, కారంచేడు, మర్రిపూడి, కొమరోలు, టంగుటూరు మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగతా చోట్ల ఇన్చార్జ్ అధికారుల పాలనే. కందుకూరు డివిజన్లో 17 మండలాల్లో కేవలం ఉలవపాడు, మర్రిపూడి మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. దీంతో మిగతా చోట్ల ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహించే వారు పూర్తిస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోతున్నారు.అనేక చోట్ల రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న హెచ్ఎంలు కూడా ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. దీంతో వారి అవస్థలు వర్ణనాతీతం.ఇన్చార్జ్ ఎంఈవోల పాలనతో ఈఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడింది. ఈ ఏడాదైనా మార్పు వచ్చేనా... ఈ విద్యా సంవత్సరంలోనైనా ఇన్చార్జ్ ఎంఈవోల పాలనకు విముక్తి కలిగిం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విద్యావ్యవస్థ పనితీరుపై దృష్టి పెట్టాలి. విద్యావ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిలో పడాలంటే ఇన్చార్జుల పాలనకు స్వస్తి పలకాల్సిన అవశ్యకత ఉంది.