కనిగిరి: విద్యాశాఖలో మండల స్థాయిలో ఎంఈవోలదే కీలకపాత్ర. అయితే వారి స్థానంలో అత్యధికంగా ఇన్‌చార్జుల పాలనే సాగుతోంది. దీంతో అనేక చోట్ల విద్యాప్రగతికి విఘాతం కలుగుతోంది. జిల్లాలోని 56 మండలాల్లో పది మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. ఇన్‌చార్జ్ ఎంఈవోలుగా పనిచేసే ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు న్యాయం చేయలేకపోతున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలకు సంబంధించిన అనేక నివేదికలు తయారు చేయడంలో ఇన్‌చార్జ్ ఎంఈవోలు నిమగ్నమవుతారు. ప్రతినెలా పాఠశాలల మౌలిక వసతులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటు, శిక్షణ తరగతులు తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు హెచ్‌ఎంలుగా విధులు నిర్వహించే పాఠశాలలకు వారానికి మూడు రోజులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొంత పాఠశాలలోని విద్యార్థులకు న్యాయం చేయలేక పనిభారంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కందుకూరు డివిజన్‌లో పరిస్థితి దయనీయం...
జిల్లాలో 56 మండలాలకు సంబంధించి ఉలవపాడు, అద్దంకి, కొరిశపాడు, సంతనూతలపాడు, జె పంగులూరు, దోర్నాల, కారంచేడు, మర్రిపూడి, కొమరోలు, టంగుటూరు మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగతా చోట్ల ఇన్‌చార్జ్ అధికారుల పాలనే. కందుకూరు డివిజన్‌లో 17 మండలాల్లో కేవలం ఉలవపాడు, మర్రిపూడి మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. దీంతో మిగతా చోట్ల ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహించే వారు పూర్తిస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోతున్నారు.అనేక చోట్ల రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న హెచ్‌ఎంలు కూడా ఇన్‌చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. దీంతో వారి అవస్థలు వర్ణనాతీతం.ఇన్‌చార్జ్ ఎంఈవోల పాలనతో ఈఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడింది.
ఈ ఏడాదైనా మార్పు వచ్చేనా...
ఈ విద్యా సంవత్సరంలోనైనా ఇన్‌చార్జ్ ఎంఈవోల పాలనకు విముక్తి కలిగిం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విద్యావ్యవస్థ పనితీరుపై దృష్టి పెట్టాలి. విద్యావ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిలో పడాలంటే ఇన్‌చార్జుల పాలనకు స్వస్తి పలకాల్సిన అవశ్యకత ఉంది.
ఇన్‌చార్జిలే దిక్కు
Published Wed, Jun 11 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement