‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని, ప్రజాసమస్యలు వెనువెంటనే పరిష్కారమవుతాయని, ఎలాంటి అర్జీలకైన సత్వరమే స్పందించి జవాబుదారీతనం పాటించేలా పాలన ఉంటుందని చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. జిల్లాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కీలకమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రజలు తమ అర్జీలతో జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి వెల్లువలా రావడం, పోవడం వంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎవరిని కదలించినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి’.
కరీంనగర్: జిల్లాలో ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతోంది. వివిధ శాఖలకు పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. మరోవైపు ఒక్కో అధికారికి అదనంగా మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పనిచేసే వారికి ఇతర జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. సంబంధిత అధికారి ఏ వారం ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి.
ఏళ్లుగా డెప్యూటేషన్లపై ఒకేచోట..
జిల్లాల పునర్విభజన తర్వాత కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించకపోవడంతో డెప్యూటేషన్లపై ఏళ్లుగా ఒకేచోట కొనసాగుతున్నారు. 15 మంది వరకు జిల్లా విద్యాశాఖ, ఎంఈవో కార్యాలయాల్లో, కొందరు ఉపాధ్యాయులు అనధికారికంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. రెవెన్యూ, వైద్యశాఖల్లో 20 నుంచి 30 మంది ఇలాగే ఉన్నారు. వైద్యశాలల్లో సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది.
ఇన్‌చార్జీల చేతుల్లో కీలక శాఖలు
► జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఆర్‌వో పోస్టులో రెండేళ్లుగా అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.
► జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. రెండు ఉప విద్యాధికారి పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి.
► జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా ఇన్‌చార్జి అధికారిగానే వ్యవహరిస్తున్నారు.
► కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలందిస్తున్న కరీంనగర్ ప్రధానాస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టు కొన్నేళ్లు ఖాళీగా ఉంది. దీంతో అదేశాఖలో పనిచేస్తున్న రత్నమాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.
► మెడికల్ షాపులను పర్యవేక్షించాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
► గనులు, భూగర్భ గనుల శాఖకు సంబంధించి ఏడీగా వ్యవహరిస్తున్న సత్యనారాయణకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇదే శాఖలో అసిస్టెంట్ జువాలజీ(ఏజీ)గా ఉన్న రవిబాబు కరీంనగర్, ములుగు జిల్లాల ఇన్‌చార్జిగా ఉన్నారు.
► తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో రెండు ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
► జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జి అధికారిగానే పనిచేస్తున్నారు.
► మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కొన్ని నెలలు సెలవులో వెళ్లడంతో అదే శాఖలో పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
► కరీంనగర్ అగ్రికల్చర్ ఏడీ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
► కార్మిక శాఖ అధికారి రమేశ్‌బాబు గత 3 నెలలుగా సెలవులో ఉండటంతో సంగారెడ్డి జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు.
► జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తార్యనాయక్ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో మరో రెండు ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
► మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారిగా సబితకుమారి పని చేస్తున్నారు.
► ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు గంగారాం, మధుసూదన్‌లకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పరిపాలన వ్యవహారాలు చూడాల్సి రావడం, అదనపు బాధ్యతలతో ఆ శాఖలపై పూర్తి పట్టు సాధించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment