
విద్యాశాఖ ‘ఔట్‌సోర్సింగ్’ ఆకలి కేకలు
కైకలూరు, న్యూస్‌లైన్ : అధికారుల అలసత్యం చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రెండు నెలలుగా జీతాలందక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. కేంద్రం ఎస్‌ఎస్‌ఏ ఔట్‌సోర్పింగ్ సిబ్బందికి బడ్జెట్ కేటాయించిన జీతాల చెల్లింపు బిల్లులపై స్పష్టత రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ సర్వశిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని క్లస్టర్ రిసోర్స్‌పర్సన్ (సీఆర్‌పీ), ఇన్‌క్లూజీవ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్‌టీ), మేనేజ్‌మెంట్ ఇన్ఫరేషన్ సిస్టమ్ కో-ఆర్డనేటర్స్ (ఎంఐఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీఈవో), మేసెంజర్స్, పార్ట్‌టైమ్ ఇన్‌స్టక్చర్స్ తదితర కేటగిరీలకు సంబంధించి 738 మంది విధులు నిర్వహిస్తున్నారు.
వీరందరికీ గత విద్యాసంవత్సరానికి ఏప్రిల్ 23తో కాంట్రాక్టు గడువు ముగిసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరానికి వీరు తిరిగి అదే నెల 28 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. అదే విధంగా మే ముగుస్తున్నా జీతాలపై అయా అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదని సిబ్బంది వాపోతున్నారు. సమీప పశ్చిమగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏప్రిల్, మే నెల జీతాలు సిబ్బందికి అందాయని, ఇక్కడ కూడా ఆ విధంగా అందించాలని సిబ్బంది కోరుతున్నారు.
ఆలస్యమవుతున్న క్రమబద్ధీకరణ దస్త్రాం..
రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని వివిధ విభాగాల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏప్రిల్ 28 నుంచి తిరిగి రెన్యూవల్‌గా గుర్తించి విధులు అప్పగించాలని రాష్ట్ర అధికారుల నుంచి అదేశాలు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం నోటిమాటగా వీరిని తిరిగి విధులు నిర్వహించమన్నారు. రెన్యూవల్‌కు సంబంధించి పత్రాలు ఇప్పటికీ రాలేదని చెబుతున్నారు.
ఇన్‌క్లూజీవ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్‌టీ)లు మాత్రం రెన్యూవల్‌కు సంబంధించి బాండు పేపర్లు అధికారులకు అందించారు. మిగిలిన వివిధ కేటగిరిల సిబ్బందిని ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందించాలని చెప్పారు. అయితే వీరినుంచి బాండు పేపర్లు తీసుకోకుండా కొంతమంది ఎంఈవోలు కావాలనే ఆలస్యం చే స్తున్నారనే విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అన్ని జిల్లాలకు భిన్నంగా ఇక్కడ జరగడంపై సిబ్బంది అసహానికి గురవుతున్నారు.
భారంగా మారుతున్న విధులు....
ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ రైలు, బస్సుల ద్వారా కేంద్రాలకు వెళుతున్నారు. ఇప్పటి వరకు జీతాలందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బడులు తెరిచే వేళకు ఆయా గ్రామాల్లో విద్యార్థులను గుర్తించడం, అదే విధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకూ జీతాలు చెల్లింపు లేకపోవడం వల్ల కుటుంబపోషణ కష్టమవుతుందని, అధికారులు జీతాలను చెల్లించాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.
కలెక్టర్ పరిశీలనలో ఉంది...
రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఏ) ఔట్‌సోర్సింగ్ బిల్లును కలెక్టర్ నోటీసుకు పంపించామని ప్రాజెక్ట్ ఆఫీసర్ పద్మావతి చెప్పారు. ఆయనకు మరోసారి సిబ్బంది బిల్లు అవశ్యకతను వివరిస్తానన్నారు. అన్ని మండలాల నుంచి జీతాలకు సంబంధించి బిల్లులు చేరలేదన్నారు. త్వరలో జీతాలు వచ్చే ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.