మా రోజుల్లోన్లే గుర్తించాం: పద్మావతి వర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు.
చదువు వేసిన మార్గం..
‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్‌లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్‌లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది.
సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ..
జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్‌ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది.
తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్‌మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను.
లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు.
జీవితంలో ముఖ్యమైన మలుపు
1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి.
విశ్రాంత జీవనంలో..
రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్‌మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్‌లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment