పెంపుడు తల్లే నిందితురాలు
కేసు వివరాలను వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.
ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది.
ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్‌రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు.
బాలికను అర్థవీడులోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్‌ఐ అనిత కేసు నమోదు చేశారు.
మార్కాపురం డీఎస్పీ బాలసుందర్‌రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్‌ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment