గుడివాడ పోలీసులకు హైకోర్టు ఆదేశం
పిటిషన్ విచారణ ఈ నెల 14కి వాయిదా
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..
ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.
ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు.
ఐపీసీ, సీఆర్‌పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.
అర్జున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment