నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: గతంలో విద్యాశాఖాధికారిగా పని చేసిన మువ్వా రామలింగం తన అడ్డగోలు నిర్ణయాలతో తీవ్ర వివాదాస్పదంగా మారి సస్పెండ్ అయినా జిల్లా విద్యాశాఖ తీరు మారలేదు. పైసలిచ్చే ఫైళ్లకు క్షణాల్లో రెక్కలొస్తున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పరిపాలనలో గత విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం కోటరీ అక్రమాలు, అవినీతికి బలైన పలువురు టీచర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. నిబంధనల ప్రకారం వీరికి ఎప్పుడో పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యాశాఖ వారి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఉపాధ్యాయులు తమ భార్యాబిడ్డలతో ఏళ్లతర బడి అర్ధాకలితో గడుపుతున్నారు. వీరి గురించి పట్టించుకునేవారు కరువయ్యారు.
క్షణాల్లో క్లియరెన్స్ అవుతున్న ఫైళ్లు.. లక్షల్లో చేతులు
మారుతున్న తీరు
విద్యాశాఖలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యే రోజు దగ్గర కొచ్చింది. పలువురు ప్రైవేటు పాఠశాలల యజమానులు లక్షలు కుమ్మరించి తమ ఫైళ్లు క్లియర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఓపనింగ్ పర్మిషన్, ప్రొవిజనల్ రికగ్నైజేషన్, రెన్యువల్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ఈ ఫైళ్ల క్లియరెన్స్ ద్వారా ప్రతిరోజూ విద్యాశాఖలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అక్రమ సంపాదన ఉందని, కలెక్టర్ విచారణ చేపడితే పలు అక్రమాలు బయట పడుతాయని ఉపాధ్యాయ లోకం కోడై కూస్తోంది.
ఉపాధ్యాయుల సస్పెన్షన్ల ఫైళ్లకు దిక్కులేదు
గత విద్యాశాఖాధికారికి వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లో పాల్గొన్నందుకు 15 మందిని, ఇతరత్రా కారణాలతో మరి కొంతమందిని అండర్ పెండింగ్ విచారణ పేరుతో సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన వారికి ఆరు నెలల తరువాత పోస్టింగ్ ఇవ్వాలి. ఏవైనా లోపాలుంటే తరువాత జరిగే విచారణలో రుజువైతే అప్పుడు ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు చేపట్టాలి. అయితే జిల్లాలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
- సర్వేపల్లిలో పని చేస్తున్న లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడిని మువ్వా కోటరీలోని ఓ ప్రధానోపాధ్యాయుడు మాటలు విని సస్పెండ్ చేశారు.
- హబీబుల్లా పరిస్థితి మరీఘోరం
ఈయన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట పాఠశాల్లో పనిచేస్తున్నాడు. ఈయన చేసిన నేరం యూటీఎఫ్ సంఘంలో సభ్యుడు కావడమే. మువ్వా కోటరీలో ఉన్న ఆ పాఠశాల హెచ్‌ఎంను పాఠశాల విషయంలో ప్రశ్నించడం ఈయన చేసిన రెండో నేరం.
ఈయన కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేదు. లాంగ్ లీవులో ఉండి నెలల తరబడిగా తన బిడ్డకు హైదరాబాద్‌లో వైద్యం చేయిస్తున్నారు. ప్రసు ్తతం కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుల పాలయ్యాడు. మువ్వా తన అనుచర గణంలోని డిప్యూటీ ఈఓను ప్రయోగించి లేనిపోని నివేదిక తయారు చేయించి సస్పెండ్ చేయించారు. నిబంధనల ప్రకారం లాంగ్ లీవులో ఉన్న హబీబుల్లాను సస్పెండ్ చేయకూడదు. ఈయన సస్పెండ్ అయినప్పటి నుంచి గ్రామస్తులు హబీబుల్లాను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కలెక్టర్‌ను కలిశారు. ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ఈయన సస్పెన్షన్ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సంబంధిత సెక్షన్‌లో ఫైలు సిద్ధం చేశారు. అయితే డీఈఓ కార్యాలయంలో ఉన్నతాధికారులు కొందరు దీన్ని తొక్కి పెట్టారు.
- సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లెలో పని చేస్తున్న ఎల్.వెంగయ్య, గంగవరం నుంచి సంజయ్‌వినోద్, ఇస్కదామెర్ల జెడ్పీ హెచ్‌ఎస్ నుంచి సత్యసాయి తదితరులతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులును కలుపుకుంటే దాదాపు 25 మంది ఉన్నారు. వీరిలో దాదాపుగా ఎక్కువ మంది మువ్వా రామలింగం కోటరీకి బలైపోయినవారే. వాస్తవాలు పరిశీలించి తమపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని పోస్టింగ్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఫైళ్లు కలెక్టరేట్ పంపుతున్నా :
సంబంధిత ఫైళ్లు కలెక్టర్‌కు పంపుతున్నా. అక్కడ పరిశీలించిన తరువాత సస్పెన్షన్లను రద్దు చేస్తాం. డీఈఓ కార్యాలయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేదు. అంతా నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి.
-ఎన్.ఉష, ఇన్‌చార్జి డీఈఓ
విద్యాశాఖ తీరు మారదా?
Published Sat, May 31 2014 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement