వెంకటాచలం : తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం విక్రమ సింహపూరి యూనివర్సిటీకి సంబంధించి రూ.12కోట్లతో నిర్మించనున్న అకడమిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని వివరించారు. యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని సముద్ర తీరం పారిశ్రామిక కారిడార్ కానుందన్నారు.
కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, అందుకు అవసరమైన రీసెర్చ్‌లు చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యూనివర్సిటీకి మహాకవి తిక్కన పేరు పెట్టాలని అప్పటి ప్రభుత్వంతో పోరాడినట్లు తెలిపారు. మన ప్రాంత మహాకవిని మనం గుర్తించుకోవాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైతికత, విద్యా ప్రమాణాలు ఉండే బోధనను యూనివర్సిటీ అందించాలన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వీఎస్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఆకాం క్షించారు. ప్రపంచ పరిశోధన పత్రాలను ప్రచురితమయ్యేలా చూస్తే యూనివర్సిటీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు.
అవసరాలు గుర్తించి ముందస్తు
ప్రణాళికలు చేపట్టాలి: కాకాణి
యూనివర్సిటీ రూపాంతరానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీకి జాతీయ రహదారి నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన స్థలం చాలా వరకు ఉపయోగ పడదని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత భూమిని సేకరించుకోవాలని సూచించారు. సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, ఆక్వా కల్చర్‌కు అనుబంధమైన కోర్సులు పెట్టాలన్నారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, ఇతర అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, భవిష్యత్ అవసరాలు గుర్తించి కోర్సులు, రీసెర్చ్‌లు జరగాలన్నారు. జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, పొంగూరు నారాయణ వంటి వివాద రహితులు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరేవారు మంత్రులుగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఉపకులపతి గొట్టిప్రోలు రాజారాంరెడ్డి, రిజిస్ట్రార్ కోటా నాగేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, బీద మస్తాన్‌రావు, ఎం.శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, ఎంపీటీసీ సభ్యుడు బాణాల వెంకమ్మ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి పాల్గొన్నారు.
ప్రతి బిడ్డ ముత్యంలా ఎదగాలి
కోవూరు: ప్రతి బిడ్డ ఒక ముత్యంలా ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కోవూరులో శనివారం ‘బడిపిలుస్తోంది’ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు నెల్లూరు జిల్లా పుట్టినిల్లు అన్నారు. ఈ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకురావాల్సిన అసరం ఉందన్నారు.
రాష్ట్రంలో 19 శాతం డ్రాపవుట్స్ ఉండగా కేవలం నెల్లూరు జిల్లాలో 23 శాతం ఉన్నారన్నారు. డ్రాపవుట్స్‌లో నెల్లూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుట్టగానే మేధావి కాదన్నారు. బాల్యం నుంచి పట్టుదల, క్రమశిక్షణతో ముందుకుపోతేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్రమశిక్షణతో చదువుకుంటే ఆ తర్వాత విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టమేమీ కాదన్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు బోధిస్తున్నామన్నారు.
గతంలో 23 మంది ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 లోపు 150 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా కోవూరులో ఒక పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి, ఆర్‌జేడీ పార్వతి, అడిషనల్ జేసీ రాజ్‌కుమార్, ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, డీఈఓ ఉష, సర్వశిక్ష అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, తహశీల్దార్ నరసింహులు, ఎంఈఓ చెంచురెడ్డి, ఎంపీడీఓ నాగరాజకుమారి, ఎంపీపీ గిద్దలూరు ఉమ, సర్పంచ్ కూట్ల ఉమ పాల్గొన్నారు.
విద్యకు పెద్ద పీట
Published Sun, Aug 3 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement