విలువలా..హవ్వా..!
సాక్షి, ఒంగోలు: ‘జిల్లా పరిషత్ ఎన్నికల్లో విలువలెక్కడున్నాయి..? అంతా అవకాశాలే కదా..! నేను టీడీపీకి నమ్మకద్రోహం చేయడమేంటి..? ఆ మాట అనే హక్కు జిల్లా టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు.. దివంగత ఎన్టీరామారావు ఆశయం నా రక్తంలోనే ఉంది..’ అని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే.. తాను జెడ్పీచైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ఆయన సోమవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..జిల్లా టీడీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారనేది తెలియదన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు హామీని నిలబెట్టేందుకే తాను జెడ్పీపీఠం అధిరోహించానన్నారు. కిందటి ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికలప్పుడు జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు తనను కూర్చోబెట్టి చంద్రబాబు మాట్లాడిన సమయంలో.. అధినేత హామీనిచ్చారని గుర్తు చేశారు. తనకు పదవి రాకుండా చేసేందుకు ‘స్థానిక’ పార్టీనాయకత్వం అనేక కుట్రలకు పాల్పడిందని.. త్వరలోనే చంద్రబాబును కలిసి కొందరి పెత్తనంను వివరిస్తానని చెప్పారు. పార్టీకతీతంగా బీఫారం లేకుండా స్వతంత్రంగా పోటీచేశానని.. తనకు టీడీపీ విప్ వర్తించదన్నారు.విప్ జారీపై ఇన్నాళ్లలో పార్టీ నేతలెవరూ తనతో సంప్రదించలేదన్నారు.
నైతిక విలువలా... హవ్వా...!
‘జెడ్పీ ఎన్నికల్లో నైతిక విలువల ప్రస్తావన ఎందుకు..? అంతా లాక్కోవడమే కదా.. జిల్లాలోని 56 జెడ్పీటీసీల్లో టీడీపీ గెలుచుకుంది 25 స్థానాలు. మరి, జెడ్పీచైర్మన్ పదవిని ఏవిధంగా కైవసం చేసుకుంటుంది. అవతల వారిని లాక్కొనే కదా..! వైఎస్సార్ సీపీ శిబిరం నుంచి ముగ్గురు టీడీపీకి వస్తే.. అందులో ఇద్దర్ని నేనే తెచ్చా.. టీడీపీకి అప్పుడు తెలియదా..? ఈ నైతికత.. మీరు (టీడీపీ) ముగ్గుర్ని మంచి చేసుకున్నారనుకుంటే, నేను 27 మందిని మంచిచేసుకున్నాను.
మీస్థాయి గొప్పదా.. నేను గొప్పా..? దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయవ్యూహం నడపడంలో తప్పేమీలేదు. జెడ్పీచైర్మన్‌గా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిలబెట్టాలనుకున్నారు. అందుకే, పొన్నలూరు జెడ్పీటీసీగా నన్ను నిలబెట్టారు. స్థానిక నాయకత్వానికి నాపై ఎందుకంత కసి, పగ.. నేను కరణం బలరాంకు వ్యతిరేకంగా అద్దంకిలో పోటీకొస్తానా..? ఒంగోలులో జనార్దన్, దర్శిలో శిద్ధా రాఘవరావు, పర్చూరు ఏలూరి సాంబశివరావుకు పోటీవచ్చే నాయకుడ్ని కాదు కదా..? మరెందుకు, నేను జెడ్పీచైర్మన్ అవుతానంటే వీరంతా కలిసి అడ్డం పడుతున్నారు. నాకు పోటీగా మన్నం రవీంద్రను తెచ్చారు.
ఆది నుంచి జిల్లా నేతలు నన్ను అలక్ష్యం చేస్తూనే ఉన్నారు. అందుకే వారిపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు నేను టీడీపీలో ముఖ్యసభ్యుడ్ని కాదనే అర్హత ఎవరికీ లేదు. ఈ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేయాలంటే నా ఒక్కడికే హక్కుంది. ఇంకెవ్వరికీ, ఆ అధికారం.. హక్కు లేదు. నా మంచితనం, పరిచయాలు ఉపయోగించుకుని స్వతంత్రంగా పోటీచేస్తానని.. నాకు మద్దతివ్వాలని వైఎస్సార్‌సీపీని కోరాను. అదే విలువలతో వైస్‌చైర్మన్ పదవికీ స్వతంత్ర అభ్యర్థికైతేనే నేను ఓటేస్తానని చెప్పాను. ఓటేశాను. జిల్లాలో 55 మంది జెడ్పీటీసీలకు నేను చైర్మన్‌ను. అందర్నీ కలుపుకునిపోతాను. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ ఒన్ జిల్లాగా మారుస్తానని’ జెడ్పీ చైర్మన్ హరిబాబు స్పష్టం చేశారు.