ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: ఖమ్మంలో జిల్లా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక స్వర్ణభారతి కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న కాలంతోపాటు ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో మొదలు స్టిల్ ఫొటోగ్రఫీ, మూవ్‌మెంట్స్‌ను టేకప్ చేసే విధానం నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అందివచ్చిన సాంకేతికతతో విస్త్రృతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హాబీగా ఫొటోగ్రఫీని మొదలుపెట్టి ప్రొఫెషనల్‌గా తయారైన వాళ్లూ ఉన్నారన్నారు. ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ తాను ఓ సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశానన్నారు. జర్నలిజానికి, ఫొటోగ్రఫీకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన వివరించారు. మీడియాకు మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో ఓ మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ సెంట ర్‌ను కేవలం డీపీఆర్‌ఓ ఆఫీసులో కాకుండా ఓ పెద్దభవనం లేదా ఆడిటోరియంలో ఏర్పాటు చేసి శాశ్వతంగా ఉపయోగపడేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఏ అసోసియేషన్ అయినా ఈ మీడియా సెంటర్‌ను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు ఉండాలనుకుంటున్నామన్నారు. మీడియా కేంద్రంలో ఎడిటింగ్ సౌలభ్యం కూడా కల్పిస్తే బాగుటుందన్నారు. వచ్చే అక్టోబర్ నాటికి జిల్లా ఏర్పడి 60 ఏళ్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ప్రజల వద్ద ఉన్న అరుదైన క్లిప్పింగ్స్‌ను సేకరించి ఓ చక్కని ఆల్బమ్ తయారు చేయాలనుకుంటున్నామన్నారు. దీనికోసం డీపీఆర్‌ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొం దించారన్నారు. ఫొట్రోగాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌కు వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాలను వారోత్సవంగా నిర్వహిస్తే బాగుటుందని ఎస్పీ రంగనాథ్ సూచిం చారు. సమ్మర్‌క్యాంప్‌లు, హాలిడే ట్రైనింగ్‌లు నిర్వహించి పిల్లలకు సైతం ఫొటోగ్రఫీపై అవగాహన కల్పించాలని కోరారు.
ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడు షేక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, డీపీఆర్‌ఓ వై. వెంకటేశ్వర్లు, మమత మెడికల్ కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నర్సిం హారావు, పి.నాగేంద్రబాబు, గౌరవ అధ్యక్షులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మమత మెడికల్ కళాశాల సహకారంతో పలువురు ఫొటోగ్రాఫర్లు రక్తదానం చేశారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్రీనివాస్, కమటం శ్రీను, హరి(సత్తుపల్లి), గడ్డం శ్రీనివాస్, జనార్దన్ (నేలకొండపల్లి), జాకీర్‌హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులను కలెక్టర్, ఎస్పీ సన్మానించారు.
మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి
Published Tue, Aug 20 2013 6:30 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement